స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
దోమలగూడ: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి బాధ్యులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అప్పారావులను సస్పెండ్ చేయాలని, రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ సాలిడాఆరిటీ అండ్ స్ట్రగుల్డ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, గోవర్ధన్ (న్యూడెమాక్రసీ, చంద్రన్న), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమాక్రసీ, రాయల), ఆమ్‌ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి పిఎల్ విశ్వేశ్వర్‌రావు, జానకిరాములు (ఆర్‌ఎస్‌పి), పీఓడబ్ల్యూ సంధ్య, ప్రొఫెసర్ కంచ అయిలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ రోహిత్ మరణాన్ని ఆపలేకపోవడం అధ్యాపకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎంపీ అసదుద్దీన్, ప్రొఫెసర్ హరగోపాల్, సూరేపల్లి సుజాత యూనివర్సిటీలో రెచ్చగొట్టారని ఆరోపిస్తున్న ఏబీవీపీ నాయకులు రోహిత్ ఎందుకు చనిపోయాడన్నదానిపై ఆలోచించకపోవడం దారుణమన్నారు అంతర్జాతీయ వాణిజ్య సంస్థ సూచనల మేరకు భవిష్యత్తులో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉండవన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్‌లో నిధులు తగ్గించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తుందని, కాషాయీకరణే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు, దేశంలో 290 మంది ప్రొఫెసర్ల లిస్టును తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ద్వారా వివిధ పోస్టుల్లో భర్తీ చేయించాలని చూస్తోందని ఆరోపించారు. ఫాసిజాన్ని ఆపకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంధ్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావులను శిక్షించాలని కోరితే బీసీలు దత్తాత్రేయకు, కమ్మలు అప్పారావుకు మద్దతుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మార్కిస్టు రాజకీయాలను విమర్శించిన రోహిత్‌కు సీపీఎం మద్దతు ఇవ్వడంపై కొందరు ప్రశ్నిస్తున్నారని, తమను విమర్శించినంత మాత్రాన రోహిత్ ఘటనపై తప్పును తప్పునుగానే చూస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసు, వెంకట్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మరెడ్డి, శారదాగౌడ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.