దత్తాత్రేయ రాజీనామా చేయాల్సిందే
⇒ ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
⇒ కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి యత్నం
ముషీరాబాద్:: దళిత విద్యార్థి రోహిత్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించా రు. ఈ సందర్భంగా వేణు, శివరామకృష్ణ మాట్లాడుతూ దత్తాత్రేయ యూనివర్సిటీకి లేఖ ఇవ్వడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఏ సంబంధం లేని ఎమ్మెల్సీ రామచంద్రరావు యూనివర్సిటీ, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఐదుగురిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. దీనికినైతిక బాధ్యత వహిస్తూ దత్తాత్రేయ రాజీనామా చేసి... బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్ కుటుంబ సభ్యులకు తక్షణం రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాలని... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అరెస్టయిన వారిలో కె.శ్రీనివాస్, వలివుల్లా ఖాద్రీ, శ్రీమాన్, ధర్మేంద్ర, రఘు, వంశీ, ప్రేమ్ తదితరులు ఉన్నారు.
మానసిక దాడులు చేస్తున్నాయి
బీజేపీ అనుబంధ సంస్థలు సామాజిక సంఘాలపై మానసిక దాడులు చేస్తున్నాయి. మేథోపరమైన చర్చలు జరగాల్సిన చోట హత్యలు జరగడం దురదృష్టకరం. యూనివర్సిటీలలో బీజేపీ అనుబంధ సంస్థలు ఏ ఒక్క సామాజిక అంశంపైనా చర్చలు నిర్వహించిన దాఖలాలు లేవు. దళిత, బలహీన వర్గాల విద్యార్థులపై ప్రణాళికాబద్ధంగా దాడి జరుగుతోంది. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య
మత తత్వాన్ని బీజేపీ పెంచి పోషిస్తోంది
బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తోంది. రాహుల్ గాంధీ పరామర్శను రాజకీయం చేయడం బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావుకు తగదు.దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై 2014లో కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు లేఖలు రాస్తే ఇప్పటివరకు సమాధానం లేదు. దళిత విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.
- వి.హనుమంతరావు, ఎంపీ
రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించాలి
రోహిత్ కుటుంబానికి కేంద్రప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించా లి. రోహి త్ కులం విషయంలో తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలి. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు
తరిమికొడతాం
రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే తరిమి కొడతాం. దళిత విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కవులు, కళాకారులు ఉన్నారు. జ్ఞానం, శీలం, ఏకత లేని సంఘాలు దళిత విద్యార్థులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటు.
- జయరాజ్, సామాజిక కవి