రేపు రాష్ర్టంలోని విద్యాసంస్థల బంద్
విజయవాడ (మొగల్రాజపురం) : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వీసీ అప్పారావును ఆ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 3వ తేదీ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని ఏపీ విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం చుట్టుగుంటలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు డి.అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కేజీ నుంచి పీజీ వరకూ అన్ని విద్యాసంస్థల్లో బుధవారం బంద్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజీవ్త్రన్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన దళిత విద్యార్థి మృతిచెందినా ముఖ్యమంత్రి చంద్రబాబు రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించే తీరిక లేనంత బిజీగా ఉన్నారన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ మాట్లాడుతూ రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రోహిత్ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ప్రవీణ్‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి మాచవరం స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు.