srumthi irani
-
అమేథీ నుంచే లోక్‌సభ బరిలో రాహుల్ గాంధీ?
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేథీ లోకసభ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం దాదాపూ ఖరారైంది. తాజాగా, ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశం నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ మాట్లాడుతూ.. అమేథీ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారని అన్నారు. త్వరలో రాహుల్ గాంధీ పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వర్సెస్ స్మృతి ఇరానీ ప్రదీప్ సింఘాల్ చెప్పినట్లుగానే రాహుల్ ఎన్నికల బరిలోకి దిగితే అమేథీలో రాజకీయం రసవత్తరంగా మారనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీపడనున్నారు. తన అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజక వర్గంలో గెలుపొంది రాహుల్ గాంధీ లోక్‌సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. అయితే, ఆమె ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. -
ప్రసార భారతిని ఎంపీలే మరిచిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశవాణి, దూరదర్శన్‌లను నిర్వహిస్తున్న ప్రసార భారతి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సూర్య ప్రకాష్ ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన వారు. ఫౌండేషన్ నిర్వాహకులకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెల్సిందే. సహజంగానే తనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సైద్ధాంతిక అనుబంధం ఉంటుందని కూడా సూర్య ప్రకాష్ ఇటీవల ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి వస్తోంది. ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఇరానీకి అధికార దర్పం కాస్త ఎక్కువే. వీరిరువురి గురించి తెలిసిన ఎవరికైనా ప్రసార భారతికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంటుందో, అది ఎంత తటస్థంగా వ్యవహరిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్‌కు, స్మృతి ఇరానీలకు ఈ మధ్య బొత్తిగా పడటం లేదు. విధానపరంగా ఎంతమాత్రం కాదు. ప్రసార భారతి బోర్డు నియామకాల విషయంలో గొడవ. బోర్డులో ఖాళీగా ఉన్న ఓ ఐఏఎస్, ఇద్దరు సీనియర్ పాత్రికేయులను నియమించాలని స్మృతి ఇరానీ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సులను సూర్య ప్రకాష్ చెత్తబుట్టలో పడేశారు. ఆ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. ఆ పోస్టుల్లోని సీనియర్ పాత్రికేయులు చూసుకోవాల్సిన అసైన్మెంట్ను 2.9 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో కోపం వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసార భారత సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ సూర్య ప్రకాష్ లొంగకుండా ఆపద్ధర్మ నిధి నుంచి సిబ్బందికి రెండు నెలల జీతాలను చెల్లించారు. ప్రసార భారతి (బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం కింద 1977లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఎంతుందో మనందరికి తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి తిరస్కరించిన విషయమూ తెల్సిందే. ప్రైవేటు టీవీ చానళ్లు వెల్లువెత్తుతున్న నేటి రోజుల్లో పబ్లిక్ బ్రాడ్ క్యాస్టింగ్ సర్వీసు ఎంతైనా అవసరం. అయితే ఈ పబ్లిక్ సర్వీసు కాస్త స్టేట్ సర్వీసుగా మారిపోయి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రభుత్వానికి బాకాలుగా మారిపోయాయి. ప్రసార భారతి చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం 22 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ ఆకాశవాణి, దూరదర్శన్ల కార్యకలాపాలను చూసుకోవాల్సి ఉంది. చట్టం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఒక్క ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్ కమిటీ కోసం డిమాండ్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ టీవీ ఎంపీల కమిటీ ఆధ్యర్యంలో నడుస్తోంది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌గా ఉన్నారు. అలాంటప్పుడైనా ప్రసార భారతీ కమిటీ గురించి గుర్తుకు రావాలి. ప్రసార భారతి చైర్మన్, మంత్రి స్మతి ఇరానీ గొడవ పడుతున్న ఈ సమయంలోనైనా పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం మంచిది. -
రోహిత్ మృతికి నిరసనగా రాస్తారోకో
రేపు రాష్ర్టంలోని విద్యాసంస్థల బంద్ విజయవాడ (మొగల్రాజపురం) : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వీసీ అప్పారావును ఆ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 3వ తేదీ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని ఏపీ విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం చుట్టుగుంటలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు డి.అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కేజీ నుంచి పీజీ వరకూ అన్ని విద్యాసంస్థల్లో బుధవారం బంద్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజీవ్త్రన్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన దళిత విద్యార్థి మృతిచెందినా ముఖ్యమంత్రి చంద్రబాబు రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించే తీరిక లేనంత బిజీగా ఉన్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ మాట్లాడుతూ రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రోహిత్ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ప్రవీణ్‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి మాచవరం స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు.