ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశవాణి, దూరదర్శన్‌లను నిర్వహిస్తున్న ప్రసార భారతి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సూర్య ప్రకాష్ ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన వారు. ఫౌండేషన్ నిర్వాహకులకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెల్సిందే. సహజంగానే తనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సైద్ధాంతిక అనుబంధం ఉంటుందని కూడా సూర్య ప్రకాష్ ఇటీవల ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి వస్తోంది. ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఇరానీకి అధికార దర్పం కాస్త ఎక్కువే. వీరిరువురి గురించి తెలిసిన ఎవరికైనా ప్రసార భారతికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంటుందో, అది ఎంత తటస్థంగా వ్యవహరిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది.
ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్‌కు, స్మృతి ఇరానీలకు ఈ మధ్య బొత్తిగా పడటం లేదు. విధానపరంగా ఎంతమాత్రం కాదు. ప్రసార భారతి బోర్డు నియామకాల విషయంలో గొడవ. బోర్డులో ఖాళీగా ఉన్న ఓ ఐఏఎస్, ఇద్దరు సీనియర్ పాత్రికేయులను నియమించాలని స్మృతి ఇరానీ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సులను సూర్య ప్రకాష్ చెత్తబుట్టలో పడేశారు. ఆ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. ఆ పోస్టుల్లోని సీనియర్ పాత్రికేయులు చూసుకోవాల్సిన అసైన్‌మెంట్‌ను 2.9 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో కోపం వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసార భారత సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ సూర్య ప్రకాష్ లొంగకుండా ఆపద్ధర్మ నిధి నుంచి సిబ్బందికి రెండు నెలల జీతాలను చెల్లించారు.
ప్రసార భారతి (బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం కింద 1977లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఎంతుందో మనందరికి తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి తిరస్కరించిన విషయమూ తెల్సిందే. ప్రైవేటు టీవీ చానళ్లు వెల్లువెత్తుతున్న నేటి రోజుల్లో పబ్లిక్ బ్రాడ్ క్యాస్టింగ్ సర్వీసు ఎంతైనా అవసరం. అయితే ఈ పబ్లిక్ సర్వీసు కాస్త స్టేట్ సర్వీసుగా మారిపోయి ఆకాశవాణి, దూరదర్శన్‌లు ప్రభుత్వానికి బాకాలుగా మారిపోయాయి.
ప్రసార భారతి చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం 22 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ ఆకాశవాణి, దూరదర్శన్‌ల కార్యకలాపాలను చూసుకోవాల్సి ఉంది. చట్టం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఒక్క ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్ కమిటీ కోసం డిమాండ్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ టీవీ ఎంపీల కమిటీ ఆధ్యర్యంలో నడుస్తోంది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌గా ఉన్నారు. అలాంటప్పుడైనా ప్రసార భారతీ కమిటీ గురించి గుర్తుకు రావాలి. ప్రసార భారతి చైర్మన్, మంత్రి స్మతి ఇరానీ గొడవ పడుతున్న ఈ సమయంలోనైనా పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment