dooradharshan
-
దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత
హైదరాబాద్, సాక్షి: ‘‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..’’ అంటూ ఏళ్లపాటు అలరించిన ఆ గాత్రం మూగబోయింది. దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. రెండ్రోజుల కిందట గుండెపోటుతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దూరదర్శన్‌లో తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా శాంతి స్వరూప్‌కు ఓ గుర్తింపు ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్.. 1978లోనే దూరదర్శన్‌లో చేరారు. అయితే యాంకరింగ్ చేసేందుకు ఆయన ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన దూరదర్శన్ తెలుగు తొలి బులిటెన్ వార్తల్ని చదివి వినిపించారాయన. టెలి ప్రాంప్టర్(ఎదురుగా స్క్రీన్ మీద చూసి..) లేని రోజుల్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు వినిపించడంలో ఆయన ఆరి తేరారు. అలా పదేళ్ల పాటు స్క్రిప్ట్పేపర్లతోనే వార్తలు చదువుతూ వచ్చారు. దూరదర్శన్‌లో 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదివారు. చాలా మంది న్యూస్ రీడర్లు శాంతి స్వరూప్‌ను తమ గురువుగా భావిస్తుంటారు. అయితే 24/7 పేరిట న్యూస్ రంగంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పుల్ని ఆయన స్వాగతించలేకపోయారు. వార్తలు చదవకండి.. వార్తలు చెప్పండి.. అని తర్వాతి తరం యాంకర్లకు సూచించారాయన. శాంతి స్వరూప్ సతీమణి రోజా రాణి కూడా న్యూస్ రీడర్. 1980లో వీళ్ల వివాహం జరగ్గా.. వీళ్లకు ఇద్దరు సంతానం విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యంపై పట్టున్న శాంతి స్వరూప్.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మీద ‘‘రాతి మేఘం’ అనే నవల రాశారు. క్రికెట్ మీద మక్కువతో ‘క్రేజ్’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ అనే నవల రాశారాయన. యాంకరింగ్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతి స్వరూప్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తొలి తరం న్యూస్ రీడర్ గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ గారి మృతి బాధాకరం. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని హరీష్ రావు అన్నారు. -
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన డీడీ స్పోర్ట్స్
రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్కుఅన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా జూలై 3నుంచి తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య విండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై రెండో వారంలో టీ20 జట్టును కూడా బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్-విండీస్ మ్యాచ్‌లు కేబుల్ ఛానెల్‌లలో ప్రసారం చేయబడవు. కేబుల్ ఛానెల్స్‌కు బదులుగా డీడీ స్పోర్ట్స్ ఛానెల్ ఉచితంగా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. డీడీ స్పోర్ట్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ జియో సినిమా, ఫ్యాన్ కోడ్ కూడా ఈ మ్యాచ్‌లను ప్రచారం చేయనున్నాయి. వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వెస్టిండీస్ సన్నాహక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..! -
మీకు అర్థమవుతోందా..!
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు షురువయ్యాయి. 3 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. టీ–శాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులు ఆన్లైన్ తరగతులను వీక్షించారు. విద్యార్థులు పాఠాలు వింటున్నారా.. లేదా..? అనే విషయాన్ని పలు ప్రాంతాల్లో కలెక్టర్‌తో సహా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. అంతేకాక.. ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్ చేయడంతో వారు కూడా విధుల్లో చేరారు. సాక్షి, ఖమ్మం: కోవిడ్–19 (కరోనా) ప్రభావం కారణంగా మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయితే అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్ ఉధృతి తగ్గలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పాఠశాలలు, అటు కళాశాలలు తెరిచేందుకు వేచి చూస్తూ వస్తోంది. నెలలు గడుస్తుండటంతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను గత నెల 27వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే కళాశాలల్లో కూడా ఆన్లైన్ తరగతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు విధుల్లో చేరడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లను కూడా విధుల్లోకి తీసుకున్నారు. దూరదర్శన్, టీ–శాట్ ద్వారా తరగతులు.. ఇళ్లలో నుంచే విద్యార్థులు దూరదర్శన్, టీ–శాట్ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులు వీక్షించారు. విద్యార్థులు టీ–శాట్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని తరగతులు విన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సదుపాయం లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేసి ఆన్లైన్ తరగతులు వినే సదుపాయం కల్పిస్తారు. తొలిరోజు మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటలకు తెలుగు, 10.30 గంటలకు ఫిజికల్ సైన్స్ బోధించారు. 7వ తరగతి విద్యార్థులకు 12 గంటలకు తెలుగు, 12.30 గంటలకు లెక్కల సబ్జెక్ట్‌ను బోధించారు. 6వ తరగతి విద్యార్థులకు 2 గంటలకు తెలుగు, 2.30 గంటలకు లెక్కలు, 8వ తరగతి విద్యార్థులకు 3.30 గంటలకు లెక్కలు, 9, 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, 4.30 గంటలకు ఫిజికల్ సైన్స్ బోధించారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేలా పర్యవేక్షించారు. వాట్సాప్‌లో 30 నుంచి 40 మంది విద్యార్థులను గ్రూపుగా తయారు చేసి.. వారికి వాట్సాప్ ద్వారా ఏ సమయంలో.. ఏ తరగతి విద్యార్థులకు.. ఏ సబ్జెక్టు బోధిస్తారో తెలియజేశారు. అలాగే ఆన్లైన్లో విన్న తరగతులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఫోన్ చేసి విద్యార్థులు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కాగా.. రఘునాథపాలెం మండలం కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో ఆన్లైన్ తరగతులను విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు తప్పనిసరి: కలెక్టర్ కర్ణన్ రఘునాథపాలెం: ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థుల హాజరును ప్రతి రోజూ తప్పక తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్లైన్ తరగతులను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులు పాఠాలు వినేందుకు చేసిన ఏర్పాట్లను, పాఠాలు వింటున్న తీరును డీఈఓ మదన్మోహన్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం అనితాదేవితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వింటున్నారా.. లేదా.. అనే అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్‌కు ఒకరిని బాధ్యులుగా చేసి.. వారి పరిధిలో ఆన్లైన్ బోధన సక్రమంగా సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ నోట్ చేసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల సెల్ నంబర్లు ప్రతి విద్యార్థి వద్ద అందుబాటులో ఉంచాలని డీఈఓను ఆదేశించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు. డీటీహెచ్, స్థానిక కేబుల్ ఆపరేటర్లు తరగతుల ప్రసారానికి అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ వి.ఆశోక్‌కుమార్, గ్రామ సర్పంచ్‌లు మాధంశెట్టి హరిప్రసాద్, రామారావు, ఉప సర్పంచ్‌లు పూర్ణచంద్రరావు, నున్నా వెంకటేశ్వర్లు, హెచ్ఎం అనిత, గ్రామ కార్యదర్శులు సంగీత, శృతి పాల్గొన్నారు. తరగతులు పర్యవేక్షించాం.. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు దూరదర్శన్, టీ–శాట్ యాప్ ద్వారా ప్రారంభమయ్యాయి. ఇటీవల అధ్యాపకులకు ఆన్లైన్ బోధనపై శిక్షణ ఇచ్చారు. దీంతో విద్యార్థుల ఆన్లైన్ తరగతులను అధ్యాపకులు పర్యవేక్షించారు. సందేహాలుంటే అధ్యాపకులను ఫోన్లో సంప్రదించి తెలుసుకోవచ్చు. – కె.రవిబాబు, ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం -
ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్
కోడలిని వేధించే అత్త ఉండదు.భర్తకు విషం కలిపి పెట్టే భార్య ఉండదు.ఆడపడుచును ఎలా వేధించాలా అని ఆలోచించే వదిన ఉండదు.అందమైన జీవితం ఉంటుంది. వాస్తవమైన సరదాల గిల్లికజ్జాల మధ్యతరగతి సంసారం ఉంటుంది. స్నేహం ఉంటుంది. సరదా ఉంటుంది.నిజంగా ఆ రోజులే వేరు. దూరదర్శన్ సీరియళ్ల రోజులే వేరు. ‘ఏ జో హై జిందగీ’ లాంటి సీరియల్స్ ఇప్పుడు లేవు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు ఎప్పుడూ చిటపటలాడుతూ ఉండే దంపతులు మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనూ కనిపిస్తూనే ఉంటారు. వారిమధ్య నిత్యం ఏవో చిన్నా పెద్ద సమస్యలు, కాసింత గందరగోళం, కూసిన్ని సరదాలు, తగినంత ప్రేమ.. తోకటపాసుల్లా టప్ టప్మని పేలుతుంటాయి. రోజూ ఏదో ఒక సందర్భం కథలా నడుస్తూనే ఉంటుంది. దీనిని 35 ఏళ్ల క్రితమే బేస్‌గా తీసుకుంది దూరదర్శన్. అలా బుల్లితెర ఆలూమగలుగా రేణు–రంజిత్‌లు వీక్షకులకు పరిచయం అయ్యారు. దశాబ్దాలు దాటిపోతున్నా ఆ జంట వేసిన నవ్వుల పందిరి ఇంకా కళ్లను దాటిపోలేదు. వారిద్దరి మధ్య రకరకాల గందరగోళ సమస్యలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దూరదర్శన్‌లో సీరియళ్లు మొదలైన తొలినాళ్లు అవి. అలాంటి రోజుల్లో మధ్యతరగతి భార్యాభర్తల జీవితంలోని సరదా సన్నివేశాలతో మొట్టమొదటి కామెడీ సిరియల్‌గా అందించింది బుల్లితెర. నటీ నటులు.. షరీప్ ఇనామ్దార్, స్వరూప్ సంపత్, రాకేష్ బేడి, సతీష్ షా , రచయిత షరాద్ జోషి, దర్శకులు కుందన్‌షా, మంజుల్ సిన్హా, రామన్ కుమార్‌లు కలిసి చే సిన హంగామా ఫన్ సీరియల్ ఏ జో హై జిందగీ. 1984లో ప్రతీ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేక్షకులను అలరించే ఈ సీరియల్‌కి టైటిల్ ట్రాక్ అందించినవారు కిశోర్‌కుమార్. దంపతులైన రంజిత్ వర్మ, రేణువర్మ ఆమె నిరుద్యోగి తమ్ముడు రాజా ఒక ఇంట్లో ఉంటారు. ఆలూ మగల ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామా..! ఒకనాడు.. తమ పెళ్లిరోజును భర్త రంజిత్ గుర్తుపెట్టుకున్నాడో లేదో టెస్ట్ చేయాలనుకుంటుంది భార్య రేణు. రంజిత్ తమ పెళ్లిరోజును మరిచిపోయినట్లు నటిస్తాడు. రేణుకి కోపం వచ్చి లాయర్ని కలుస్తుంది విడాకుల కోసం. ఆ లాయర్‌కి అది మొదటి కేసు. ఒక అబద్ధపు విడాకుల పత్రాన్ని రంజిత్‌కి పంపించి బెదిరించాలనుకుంటుంది. తీరా సాయంత్రానికి రంజిత్ గిఫ్ట్‌తో రేణుని సర్ప్రైజ్ చేయడంతో ఇద్దరూ కలిసిపోతారు. ఇదో విడాకుల కహాని. మర్నాడు.. రేణు, రంజిత్ల ఇంటికి ఒక కొత్త సోఫాను తీసుకొస్తాడు సేల్స్‌మ్యాన్. పొరుగింట్లో ఇవ్వాల్సిన డెలివరీని సేల్స్‌మ్యాన్ పొరపాటున వీళ్ల ఇంట్లో ఇచ్చి వెళ్లిపోతాడు. అతిథులు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఆ సమయంలోనే పొరుగింటివాళ్లు వచ్చి అసలు విషయం చెప్పి, సోఫా తీసుకెళ్తామంటారు. అతిథుల ముందు పరువు పోగొట్టుకోలేక, పొరుగింటి వాళ్లను మేనేజ్ చేయడానికి రేణు, రంజిత్‌లు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఒకరోజు.. పొరుగింటివాళ్లు రంజిత్, రేణుల ఇంటికి వచ్చి ‘మా అమ్మాయి కవితకి పెళ్లి చూపులు. మా ఇంట్లో సరైన స్థలం లేదు మీ ఇంట్లో ఏర్పాటు చేస్తాం చూపులు’ అంటే ‘సరే’ అంటారు. వరుడు, అతని తరపు వాళ్లు వచ్చాక పొరపాటున రేణుని వధువుగా పరిచయం చేస్తారు. వాళ్లూ రేణుయే పెళ్లికూతురు అనుకుంటారు. అయితే వరుడు కవితను ఇష్టపడతాడు. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ రెండో అబ్బాయికి కవితను ఇచ్చి చేయాలనుకుంటారు. ఇరుకుటుంబాల మధ్య పెద్ద గందరగోళం. చివరకు సమస్య పరిష్కారం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మరో రోజు.. రంజిత్ రొటీన్ మెడికల్ చెకప్‌కి డాక్టర్ వద్దకు వెళతాడు. మెడికల్ రిపోర్టులు చూసిన డాక్టర్ రంజిత్‌కు క్యాన్సర్ ఉందని, ఐదు రోజులకన్నా బతకడని బాధగా చెబుతాడు. రంజిత్ డిప్రెషన్‌కి గురవుతాడు. రేణుకి ఆమె తమ్ముడు రాజాకి ఈ విషయం చెప్పవద్దని నిర్ణయించుకుంటాడు. అయితే, వింతగా నటించడం మొదలుపెడతాడు. చివరకు నర్సు పొరపాటు కారణంగా రిపోర్టులు మారిపోయాయని డాక్టర్ ద్వారా నిజం తెలుస్తుంది. ఇంకోరోజు.. పొరుగింటి కవిత తాను తల్లిని కాబోతున్నాననే విషయం చెప్పి, పుట్టబోయే బిడ్డకు సాక్స్ అల్లి ఇవ్వమని అడుగుతుంది రేణుని. అలాగే అని చెప్పిన రేణు సాక్సులు అల్లుతుంటుంది. ఇది చూసిన రంజిత్ రేణు గర్భవతి అనుకుంటాడు. రంజిత్ తమ ఇంట్లోకి రాబోయే కొత్త ప్రాణి గురించి మాట్లాడుతుంటాడు. రేణు కొత్తగా వచ్చే కుక్క పిల్ల గురించి ఆలోచించి తనూ అదేవిధంగా మాట్లాడుతుంది. ఈ గందరగోళం చివరికెప్పటికో క్లియర్ అవుతుంది. ఇలాగే మొత్తం 67 వారాలు. సరదా సరదా సన్నివేశాలతో 67 ఎపిసోడ్లలో ప్రతీవారం అరగంటపాటు బుల్లితెర నిండుగా నవ్వుల జల్లులు కురిశాయి. ఈ షో విజయవంతం అవడం, ఆ తర్వాత కొన్నికారణాల వల్ల రంజిత్ పాత్రధారి ఇనామ్దార్ బయటకు వెళ్లిపోవడంతో సెకండ్ అటెమ్ట్గా రేణు తమ్ముడు రాజాతో కథను నడిపించారు. రంజిత్–రేణులు విదేశాలకు వెళ్లినట్టు, రాజా రంజిత్ బంధువులింట్లో ఉన్నట్టు, వారి కూతురు రశ్మి, పనిమనిషి, రాజా ప్రేమించే నివేదిత .. వీళ్లందరి మధ్య సాగే కథనాన్ని ఇందులో చూపించారు. రంజిత్–రేణులు 45 ఎపిసోడ్ల వరకు ఉండగా, ఆ తర్వాత ఎపిసోడ్లలో రాజా స్టోరీ ఉంటుంది. మూడు సీజన్స్‌గా 67 ఎపిసోడ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మొట్టమొదటి కామెడీ సీరియల్ ‘ఏ జో హై జిందగీ.’ -
ప్రసార భారతిని ఎంపీలే మరిచిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశవాణి, దూరదర్శన్‌లను నిర్వహిస్తున్న ప్రసార భారతి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సూర్య ప్రకాష్ ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన వారు. ఫౌండేషన్ నిర్వాహకులకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెల్సిందే. సహజంగానే తనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సైద్ధాంతిక అనుబంధం ఉంటుందని కూడా సూర్య ప్రకాష్ ఇటీవల ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి వస్తోంది. ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఇరానీకి అధికార దర్పం కాస్త ఎక్కువే. వీరిరువురి గురించి తెలిసిన ఎవరికైనా ప్రసార భారతికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంటుందో, అది ఎంత తటస్థంగా వ్యవహరిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్‌కు, స్మృతి ఇరానీలకు ఈ మధ్య బొత్తిగా పడటం లేదు. విధానపరంగా ఎంతమాత్రం కాదు. ప్రసార భారతి బోర్డు నియామకాల విషయంలో గొడవ. బోర్డులో ఖాళీగా ఉన్న ఓ ఐఏఎస్, ఇద్దరు సీనియర్ పాత్రికేయులను నియమించాలని స్మృతి ఇరానీ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సులను సూర్య ప్రకాష్ చెత్తబుట్టలో పడేశారు. ఆ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. ఆ పోస్టుల్లోని సీనియర్ పాత్రికేయులు చూసుకోవాల్సిన అసైన్మెంట్ను 2.9 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో కోపం వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసార భారత సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ సూర్య ప్రకాష్ లొంగకుండా ఆపద్ధర్మ నిధి నుంచి సిబ్బందికి రెండు నెలల జీతాలను చెల్లించారు. ప్రసార భారతి (బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం కింద 1977లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఎంతుందో మనందరికి తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి తిరస్కరించిన విషయమూ తెల్సిందే. ప్రైవేటు టీవీ చానళ్లు వెల్లువెత్తుతున్న నేటి రోజుల్లో పబ్లిక్ బ్రాడ్ క్యాస్టింగ్ సర్వీసు ఎంతైనా అవసరం. అయితే ఈ పబ్లిక్ సర్వీసు కాస్త స్టేట్ సర్వీసుగా మారిపోయి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రభుత్వానికి బాకాలుగా మారిపోయాయి. ప్రసార భారతి చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం 22 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ ఆకాశవాణి, దూరదర్శన్ల కార్యకలాపాలను చూసుకోవాల్సి ఉంది. చట్టం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఒక్క ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్ కమిటీ కోసం డిమాండ్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ టీవీ ఎంపీల కమిటీ ఆధ్యర్యంలో నడుస్తోంది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌గా ఉన్నారు. అలాంటప్పుడైనా ప్రసార భారతీ కమిటీ గురించి గుర్తుకు రావాలి. ప్రసార భారతి చైర్మన్, మంత్రి స్మతి ఇరానీ గొడవ పడుతున్న ఈ సమయంలోనైనా పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం మంచిది. -
పరీక్షల ఒత్తిడి తగ్గింపుపై ‘పీఎం’ ప్రసంగం
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): ఈనెల 16వ తేదీన ‘పరీక్షల ఒత్తిడిని ఏ విధంగా తగ్గించాలి’ అన్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దూరదర్శన్ ఛానెళ్లలో విద్యార్థులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారని డీఈఓ నాంపల్లి రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులను(6వ తరగతి పైబడిన) ఉద్ధేశించి మాట్లాడుతారని పేర్కొన్నారు. ఆలిండియా రేడియో, ఎఫ్ఎం ఛానెల్స్, పీఎంఓ, ఎంహెచ్ఆర్డీ, దూరదర్శన్, యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్బుక్ లైవ్, స్వయంప్రద చానెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందన్నారు. కావున జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్, రెసిడెన్సియల్ స్కూల్, ప్రయివేటు స్కూల్ యాజమాన్యాలు వారి పాఠశాలల్లో విద్యార్థులు వీక్షించేంందుకు తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంపై ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఈ కింద పేర్కొన్న వెబ్సైట్ www.innovate.mygov.in లో వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని డీఈఓ కోరారు. -
రిగ్గింగ్ నివారణకు చర్యలు
మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో రిగ్గింగ్‌ను, ధనప్రవాహాన్ని అడ్డుకోవడానికి అధికారులకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ జరిగి దానిలో గెలిచిన అభ్యర్థికి 75 శాతం పైగా ఓట్లు వచ్చి ఉంటే అలాంటి పోలింగ్ స్టేషన్లను క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించాలని తెలిపింది. అలాంటి బూత్‌ల వద్ద రిగ్గింగ్‌ను నివారించడానికి అవసరమైతే మరిన్ని బలగాలను మోహరించాలని, అదనంగా పరిశీలకులను పంపి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని తన ఆదేశాల్లో కోరింది. ప్రధాన ఎన్నికల అధికారులకు ప్రత్యేకంగా జారీ చేసిన మార్గదర్శకాల్లో.. రెండు దశల్లో పోలింగ్ నిర్వహించే సందర్భంగా అధికారులను అటూ ఇటూ మార్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది. అలాగే గత ఎన్నికల సరళిని కూడా గమనించి క్లిష్టమైన బూత్‌లను గుర్తించాలని తెలిపింది. దూరదర్శన్‌లో ఉచిత ప్రచారానికి సమయం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఉచిత ప్రచారం చేసుకునేందుకు 25 గంటల చొప్పున సమయం కేటాయిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది. అలాగే 47 రాష్ర్ట పార్టీలకు 30 గంటల చొప్పున సమయం కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వరంగ టీవీ, రేడియో ద్వారా పార్టీల ఉచిత ప్రచారాన్ని ఈసీ 1998 ఫిబ్రవరిలో ప్రారంభించింది. తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ అస్సాంలోని ఐదు స్థానాలతోపాటు త్రిపురలోని ఒక స్థానానికి ఏప్రిల్ 7న జరగనున్న లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అస్సాంలోని తేజ్‌పూర్, కలియాబోర్, జోర్హత్, దిబ్రూగఢ్, లఖీంపూర్ సీట్లకు, త్రిపుర (పశ్చిమ) స్థానానికి ఈ పోలింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది గౌరవవేతనం పెంపు కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనాన్ని ఎన్నికల కమిషన్ పెంచింది. ఒక్కో ప్రిసైడింగ్ అధికారి గౌరవవేతనాన్ని ఇప్పటివరకూ ఉన్న రూ. 1,100 నుంచి 1,600కు పెంచుతున్నట్లు తెలిపింది. అలాగే మరో రూ. 300ను కంటిజెన్సీ సొమ్ము కింద అదనంగా చెల్లించనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఒక్కో పోలింగ్ అధికారి గౌరవవేతనాన్ని ఇప్పటివరకూ ఉన్న రూ. 800 నుంచి రూ. 1,150కు పెంచుతున్నట్లు వివరించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సహాయ ప్రధాన ఎన్నికల అధికారి అమిత్జ్యోతి భట్టాచార్య శుక్రవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఈ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.