ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్‌ | Special Story On Great Indian Television Serial Yeh Jo Hai Zindagi | Sakshi
Sakshi News home page

 ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్‌

Published Wed, Jul 31 2019 8:41 AM | Last Updated on Wed, Jul 31 2019 8:42 AM

Special Story On Great Indian Television Serial Yeh Jo Hai Zindagi  - Sakshi

కోడలిని వేధించే అత్త ఉండదు.భర్తకు విషం కలిపి పెట్టే భార్య ఉండదు.ఆడపడుచును ఎలా వేధించాలా అని ఆలోచించే వదిన ఉండదు.అందమైన జీవితం ఉంటుంది. వాస్తవమైన సరదాల గిల్లికజ్జాల మధ్యతరగతి సంసారం ఉంటుంది. స్నేహం ఉంటుంది. సరదా ఉంటుంది.నిజంగా ఆ రోజులే వేరు. దూరదర్శన్‌ సీరియళ్ల రోజులే వేరు. ‘ఏ జో హై జిందగీ’ లాంటి సీరియల్స్‌ ఇప్పుడు లేవు

నిప్పుల మీద ఉప్పు వేసినట్టు ఎప్పుడూ చిటపటలాడుతూ ఉండే దంపతులు మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనూ కనిపిస్తూనే ఉంటారు. వారిమధ్య నిత్యం ఏవో చిన్నా పెద్ద సమస్యలు, కాసింత గందరగోళం, కూసిన్ని సరదాలు, తగినంత ప్రేమ.. తోకటపాసుల్లా టప్‌ టప్‌మని పేలుతుంటాయి. రోజూ ఏదో ఒక సందర్భం కథలా నడుస్తూనే ఉంటుంది. దీనిని 35 ఏళ్ల క్రితమే బేస్‌గా తీసుకుంది దూరదర్శన్‌. అలా బుల్లితెర ఆలూమగలుగా రేణు–రంజిత్‌లు వీక్షకులకు పరిచయం అయ్యారు.

దశాబ్దాలు దాటిపోతున్నా ఆ జంట వేసిన నవ్వుల పందిరి ఇంకా కళ్లను దాటిపోలేదు. వారిద్దరి మధ్య రకరకాల గందరగోళ సమస్యలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దూరదర్శన్‌లో సీరియళ్లు మొదలైన తొలినాళ్లు అవి. అలాంటి రోజుల్లో మధ్యతరగతి భార్యాభర్తల జీవితంలోని సరదా సన్నివేశాలతో మొట్టమొదటి కామెడీ సిరియల్‌గా అందించింది బుల్లితెర.  

నటీ నటులు.. షరీప్‌ ఇనామ్‌దార్, స్వరూప్‌ సంపత్, రాకేష్‌ బేడి, సతీష్‌ షా , రచయిత షరాద్‌ జోషి, దర్శకులు కుందన్‌షా, మంజుల్‌ సిన్హా, రామన్‌ కుమార్‌లు కలిసి చే సిన హంగామా ఫన్‌ సీరియల్‌ ఏ జో హై జిందగీ. 1984లో ప్రతీ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేక్షకులను అలరించే ఈ సీరియల్‌కి టైటిల్‌ ట్రాక్‌ అందించినవారు కిశోర్‌కుమార్‌. దంపతులైన రంజిత్‌ వర్మ, రేణువర్మ ఆమె నిరుద్యోగి తమ్ముడు రాజా ఒక ఇంట్లో ఉంటారు. 

ఆలూ మగల ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామా..!
ఒకనాడు.. తమ పెళ్లిరోజును భర్త రంజిత్‌ గుర్తుపెట్టుకున్నాడో లేదో టెస్ట్‌ చేయాలనుకుంటుంది భార్య రేణు. రంజిత్‌ తమ పెళ్లిరోజును మరిచిపోయినట్లు నటిస్తాడు. రేణుకి కోపం వచ్చి లాయర్‌ని కలుస్తుంది విడాకుల కోసం. ఆ లాయర్‌కి అది మొదటి కేసు. ఒక అబద్ధపు విడాకుల పత్రాన్ని రంజిత్‌కి పంపించి బెదిరించాలనుకుంటుంది. తీరా సాయంత్రానికి రంజిత్‌ గిఫ్ట్‌తో రేణుని సర్‌ప్రైజ్‌ చేయడంతో ఇద్దరూ కలిసిపోతారు. ఇదో విడాకుల కహాని. 

మర్నాడు.. రేణు, రంజిత్‌ల ఇంటికి ఒక కొత్త సోఫాను తీసుకొస్తాడు సేల్స్‌మ్యాన్‌. పొరుగింట్లో ఇవ్వాల్సిన డెలివరీని సేల్స్‌మ్యాన్‌ పొరపాటున వీళ్ల ఇంట్లో ఇచ్చి వెళ్లిపోతాడు. అతిథులు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఆ సమయంలోనే పొరుగింటివాళ్లు వచ్చి అసలు విషయం చెప్పి, సోఫా తీసుకెళ్తామంటారు. అతిథుల ముందు పరువు పోగొట్టుకోలేక, పొరుగింటి వాళ్లను మేనేజ్‌ చేయడానికి రేణు, రంజిత్‌లు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. 

ఒకరోజు.. పొరుగింటివాళ్లు రంజిత్, రేణుల ఇంటికి వచ్చి ‘మా అమ్మాయి కవితకి పెళ్లి చూపులు. మా ఇంట్లో సరైన స్థలం లేదు మీ ఇంట్లో ఏర్పాటు చేస్తాం చూపులు’ అంటే ‘సరే’ అంటారు. వరుడు, అతని తరపు వాళ్లు వచ్చాక పొరపాటున రేణుని వధువుగా పరిచయం చేస్తారు. వాళ్లూ రేణుయే పెళ్లికూతురు అనుకుంటారు. అయితే వరుడు కవితను ఇష్టపడతాడు. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ రెండో అబ్బాయికి కవితను ఇచ్చి చేయాలనుకుంటారు. ఇరుకుటుంబాల మధ్య పెద్ద గందరగోళం. చివరకు సమస్య పరిష్కారం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. 

మరో రోజు.. రంజిత్‌ రొటీన్‌ మెడికల్‌ చెకప్‌కి డాక్టర్‌ వద్దకు వెళతాడు. మెడికల్‌ రిపోర్టులు చూసిన డాక్టర్‌ రంజిత్‌కు క్యాన్సర్‌ ఉందని, ఐదు రోజులకన్నా బతకడని బాధగా చెబుతాడు. రంజిత్‌ డిప్రెషన్‌కి గురవుతాడు. రేణుకి ఆమె తమ్ముడు రాజాకి ఈ విషయం చెప్పవద్దని నిర్ణయించుకుంటాడు. అయితే, వింతగా నటించడం మొదలుపెడతాడు. చివరకు నర్సు పొరపాటు కారణంగా రిపోర్టులు మారిపోయాయని డాక్టర్‌ ద్వారా నిజం తెలుస్తుంది.  

ఇంకోరోజు.. పొరుగింటి కవిత తాను తల్లిని కాబోతున్నాననే విషయం చెప్పి, పుట్టబోయే బిడ్డకు సాక్స్‌ అల్లి ఇవ్వమని అడుగుతుంది రేణుని. అలాగే అని చెప్పిన రేణు సాక్సులు అల్లుతుంటుంది. ఇది చూసిన రంజిత్‌ రేణు గర్భవతి అనుకుంటాడు. రంజిత్‌ తమ ఇంట్లోకి రాబోయే కొత్త ప్రాణి గురించి మాట్లాడుతుంటాడు. రేణు కొత్తగా వచ్చే కుక్క పిల్ల గురించి ఆలోచించి తనూ అదేవిధంగా మాట్లాడుతుంది. ఈ గందరగోళం చివరికెప్పటికో క్లియర్‌ అవుతుంది. 

ఇలాగే మొత్తం 67 వారాలు. సరదా సరదా సన్నివేశాలతో 67 ఎపిసోడ్లలో ప్రతీవారం అరగంటపాటు బుల్లితెర నిండుగా నవ్వుల జల్లులు కురిశాయి. ఈ షో విజయవంతం అవడం, ఆ తర్వాత కొన్నికారణాల వల్ల రంజిత్‌ పాత్రధారి ఇనామ్‌దార్‌ బయటకు వెళ్లిపోవడంతో సెకండ్‌ అటెమ్ట్‌గా రేణు తమ్ముడు రాజాతో కథను నడిపించారు. రంజిత్‌–రేణులు విదేశాలకు వెళ్లినట్టు, రాజా రంజిత్‌ బంధువులింట్లో ఉన్నట్టు, వారి కూతురు రశ్మి, పనిమనిషి, రాజా ప్రేమించే నివేదిత .. వీళ్లందరి మధ్య సాగే కథనాన్ని ఇందులో చూపించారు. రంజిత్‌–రేణులు 45 ఎపిసోడ్ల వరకు ఉండగా, ఆ తర్వాత ఎపిసోడ్లలో రాజా స్టోరీ ఉంటుంది. మూడు సీజన్స్‌గా  67 ఎపిసోడ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మొట్టమొదటి కామెడీ సీరియల్‌ ‘ఏ జో హై జిందగీ.’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement