రిగ్గింగ్ నివారణకు చర్యలు | Guidelines issued by the Election Commission | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్ నివారణకు చర్యలు

Published Sat, Mar 15 2014 1:41 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

రిగ్గింగ్ నివారణకు చర్యలు - Sakshi

రిగ్గింగ్ నివారణకు చర్యలు

మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో రిగ్గింగ్‌ను, ధనప్రవాహాన్ని అడ్డుకోవడానికి అధికారులకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ జరిగి దానిలో  గెలిచిన అభ్యర్థికి 75 శాతం పైగా ఓట్లు వచ్చి ఉంటే అలాంటి పోలింగ్ స్టేషన్లను క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లుగా గుర్తించాలని తెలిపింది. అలాంటి బూత్‌ల వద్ద రిగ్గింగ్‌ను నివారించడానికి అవసరమైతే మరిన్ని బలగాలను మోహరించాలని, అదనంగా పరిశీలకులను పంపి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని తన ఆదేశాల్లో కోరింది. ప్రధాన ఎన్నికల అధికారులకు ప్రత్యేకంగా జారీ చేసిన మార్గదర్శకాల్లో.. రెండు దశల్లో పోలింగ్ నిర్వహించే సందర్భంగా అధికారులను అటూ ఇటూ మార్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది. అలాగే గత ఎన్నికల సరళిని కూడా గమనించి క్లిష్టమైన బూత్‌లను గుర్తించాలని తెలిపింది.
 
 దూరదర్శన్‌లో ఉచిత ప్రచారానికి సమయం
 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఉచిత ప్రచారం చేసుకునేందుకు 25 గంటల చొప్పున సమయం కేటాయిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది. అలాగే 47 రాష్ర్ట పార్టీలకు 30 గంటల చొప్పున సమయం కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వరంగ టీవీ, రేడియో ద్వారా పార్టీల ఉచిత ప్రచారాన్ని ఈసీ 1998 ఫిబ్రవరిలో ప్రారంభించింది.
 
 తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్
 అస్సాంలోని ఐదు స్థానాలతోపాటు త్రిపురలోని ఒక స్థానానికి ఏప్రిల్ 7న జరగనున్న లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అస్సాంలోని తేజ్‌పూర్, కలియాబోర్, జోర్హత్, దిబ్రూగఢ్, లఖీంపూర్ సీట్లకు, త్రిపుర (పశ్చిమ) స్థానానికి ఈ పోలింగ్ జరగనుంది.
 
 ఎన్నికల సిబ్బంది గౌరవవేతనం పెంపు
 కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనాన్ని ఎన్నికల కమిషన్ పెంచింది. ఒక్కో ప్రిసైడింగ్ అధికారి గౌరవవేతనాన్ని ఇప్పటివరకూ ఉన్న రూ. 1,100 నుంచి 1,600కు పెంచుతున్నట్లు తెలిపింది. అలాగే మరో రూ. 300ను కంటిజెన్సీ సొమ్ము కింద అదనంగా చెల్లించనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఒక్కో పోలింగ్ అధికారి గౌరవవేతనాన్ని ఇప్పటివరకూ ఉన్న రూ. 800 నుంచి రూ. 1,150కు పెంచుతున్నట్లు వివరించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సహాయ ప్రధాన ఎన్నికల అధికారి అమిత్‌జ్యోతి భట్టాచార్య శుక్రవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఈ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement