
శ్వేతపత్రం ప్రకటించాలి
రూ.1.75 లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయో వెల్లడించాలి: బొత్స
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.1.75 లక్షల కోట్ల మేర నిధులు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నారని, ఆయన చెబుతున్నది వాస్తవమా? నిజమైతే దేనికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడైనా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎందుకు కోరలేక పోయారని, కనీసం ఒత్తిడి కూడా ఎందుకు చేయలేక పోయారని ప్రశ్నించారు. ‘సేవ్ బీజేపీ – లీవ్ టీడీపీ’ (బీజేపీని రక్షించండి – టీడీపీని వదలి వేయండి)అని మిత్రపక్షమైన బీజేపీ కార్యకర్తలే నినదించారంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఇంతకంటే అవమానం ఏముంటుందన్నారు.
మహానాడులో ఆత్మస్తుతి, పరనింద
విశాఖపట్టణంలో జరుగుతున్న టీడీపీ మహానాడు ఆత్మస్తుతి–పరనింద మాదిరిగా సాగుతోందని బొత్స విమర్శించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు–సమీక్ష అంటూ మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారన్నారు.గతంలో బీహార్‌లో నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని, నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఒక్క డీజీపీకి తప్ప మరెవరికీ రక్షణ లేదని ఎద్దేవా చేశారు.