చాక్లెట్లు ఆశ చూపి బాలుడి కిడ్నాప్
Published Mon, Oct 3 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
అత్తాపూర్: చాక్లెట్లు ఆశ చూపి ఇద్దరు చిన్నారులను అగంతకురాలు ఆటోలో తీసుకెళ్లింది. మార్గం మధ్యలో అక్కను విడిచిపెట్టి.. తమ్ముడ్ని ఎత్తుకెళ్లింది. పోలీసులు, బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ చింతల్‌మెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిలాల్, సాజీదాబేగం దంపతులకు రేష్మా(7), ఖలీల్(4) సంతానం. సోమవారం ఉదయం 10 గంటలకు రేష్మా, ఖలీల్‌లు ఇంటి బయట ఆడుకుంటుండగా బురఖా ధరించిన ఓ మహిళ వారి వద్దకు వచ్చింది.
తనతో వస్తే చాక్లెట్ ఇప్పిస్తానని వారిని ఆటోలో ఎక్కించుకుంది. చింతల్‌మెట్ చౌరస్తా వద్ద రేష్మాకు రూ.10 ఇచ్చి చాక్లెట్లు తెమ్మని పంపింది. రేష్మా ఆటో దిగగానే.. బాలుడితో అక్కడి నుంచి పరారైంది. వెంటనే రేష్మా ఇంటికి వెళ్లి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. స్థానికంగా గాలించినా ఖలీల్ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి రేష్మా తెలిపిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... బాలుడ్ని కిడ్నాప్ చేసిన అగంతకురాలిని గుర్తించేందుకు సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Advertisement
Advertisement