
పంటకు ఊపిరి
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు
- ఊపిరిపీల్చుకున్న అన్నదాత
సాక్షి, హైదరాబాద్: ఆలస్యంగానైనా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ప్రాణం వచ్చింది! ఎండిపోతున్న అనేక పంటలకు ఈ వానలు ఊపిరి పోశాయి. ఇప్పటికే ఎండిపోయి న మొక్కజొన్న మినహాయిస్తే మిగిలిన పంటలకు తాజా వర్షాలతో ఉపయోగం ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. ప్రధానంగా కంది, పత్తి పంటలకు ఈ వర్షాలు ప్రాణదాతగా నిలుస్తాయని అంచనా వేసింది. సమయం మించిపోయినందున ఇప్పుడు ఖరీఫ్ వరి నాట్లు వేయడం కష్టమేనని.. అందుకే రైతులు ముందస్తు రబీకి వెళ్లడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఆశలు వదులుకోవాల్సిందే
రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు. ఇందులో 90 లక్షల ఎకరాల్లో (84%) సాగు జరిగింది. అత్యధికంగా పత్తి 30 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 14.32 లక్షల ఎకరాల్లో వేశారు. సాధారణం కంటే 118 శాతం అధికంగా ఈ పంటను సాగు చేశారు. అలాగే కంది 10.64 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ 7.36 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలు వేయాలని సర్కారు సూచించడంతో రైతులు అనేక మంది ఈ పంటలను ఎంచుకున్నారు. అయితే ఆగస్టు చివరి వరకు పెద్దగా వర్షాల్లేకపోవడంతో మొక్కజొన్న దాదాపు 75 శాతం వరకు ఎండిపోయింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోయినట్టు అంచనా వేశారు. మిగిలిన 25 శాతం పంటకు ఈ వర్షాలు కొంతమేర ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కందికి మాత్రం ఈ వర్షాలు నూటికి నూరు శాతం ప్రయోజనం చేకూర్చనున్నాయి. వరి ఖరీఫ్‌లో 24.35 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా... ఇప్పటివరకు 15.04 లక్షల ఎకరాల్లో(62%) నాట్లు పడ్డాయి.
ముంచెత్తుతున్న వానలు
రెండు మూడ్రోజులుగా వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల వాగులు పొంగుతున్నాయి. చెరువులు నిండడంతో భూగర్భజల మట్టం పెరిగి బోర్లపై ఆధారపడ్డ రైతులకు ఉపశమనం కలుగనుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం 8.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో 22 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. అదే జిల్లా పరిగిలో 21, గాండీడ్‌లో, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 13 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 584.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా... బుధవారం నాటికి 549 మి.మీ. (6 శాతం లోటు) కురిసింది. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులలో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా వారి ఉత్పత్తులను యార్డుల్లోని షెడ్లలో నిల్వ చేయాలన్నారు. మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు పుంజుకోవడంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 120 మిల్లీమీటర్లు గరిష్ట వర్షపాతం కురిసింది.