ఔను వాళ్లిద్దరూ.. ఒక్కటయ్యారు | BTech boy beautician Girl love marriage | Sakshi
Sakshi News home page

ఔను వాళ్లిద్దరూ.. ఒక్కటయ్యారు

Published Mon, Apr 25 2016 1:57 AM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

ఔను వాళ్లిద్దరూ.. ఒక్కటయ్యారు - Sakshi

ఔను వాళ్లిద్దరూ.. ఒక్కటయ్యారు

బీటెక్ అబ్బాయి.. బ్యూటీషియన్ అమ్మాయి
వరుడు మైనర్ కావడంతో 8నెలల ఎడబాటు
బస్తీపెద్దల సమక్షంలో మరోమారు పెళ్లి

 
చిలకలగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వరుడు మైనర్ కావడంతో 8 నెలల ఎడబాటుకు గురయ్యారు. వరుడి తల్లితండ్రులు ప్రేమవివాహాన్ని అంగీకరించకపోవడంతో భర్త కనిపించడంలేదని భార్య ఫిర్యాదు చేసింది. ప్రేమజంట మేజర్లేనని తెలుసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. వివరాలు.. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన బ్యూటీషియన్ కోర్సు చేసిన ఎం.మౌనిక (22) బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన పీ.ఆదర్శ్(21) బీటెక్ చదువుతున్నాడు. ఇరువురు ప్రేమించుకుని పెద్దలకు చెప్పకుండా గతేడాది ఆగస్ట్ 16వ తేదీన యాదగిరికొండ పాత నర్సింహస్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేశారు.

వివాహానంతరం వారు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. సర్టిఫికెట్లు పరిశీలించిన పోలీసు లు వరుడు ఆదర్శ్ మైనర్ అని నిర్ధారించారు. మేజర్ అయ్యేందుకు ఇంకో మూడు నెలలు వ్యవధి ఉందని తేలింది. దీంతో పోలీసులు సూచన మేరకు నూతన దంపతులు ఎవరింటికి వాళ్లు వెల్లిపోయారు. 3 నెలల తర్వాత ఆదర్శ్‌ను కలిసేందుకు మౌనిక పలు ప్రయత్నాలు చేసినా నెరవేరలేదు. దీంతో వారం రోజుల క్రితం మౌనిక తన భర్త ఆదర్శ్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, వివాహం నాటి ఫొటోలు జతచేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదివారం ఠాణా ప్రాంగణంలో ఆదర్శ్‌తో పాటు అతని కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఆదర్శ్ కుటుంబసభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. ఆదర్శ్ మాత్రం తాను ప్రస్తుతం మేజర్‌నని, మౌనికతోనే కలిసి ఉంటానని స్పష్టం చేశాడు. దీంతో బస్తీపెద్దలు ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయ ప్రాంగణంలో ప్రేమజంటకు మరోమారు వివాహం జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement