సీట్లకు కోతే కోత..!
బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ కాలేజీల్లో భారీగా సీట్ల తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఈసారి బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లోనే కాదు.. ఎంటెక్, ఎంబీఏ, ఎం.ఫార్మసీ కాలేజీల్లోనూ సీట్ల సంఖ్య భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఆయా కాలేజీల్లో అనేక బ్రాంచీలకు అధికారులు కోత విధించినట్లు తెలిసింది. బీటెక్‌లో 45 వేల నుంచి 50 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉండగా.. ఎంబీఏ, ఎంటెక్, ఎం.ఫార్మసీలో ఉన్న దాదాపు 70 వేల సీట్లలో 25 వేల సీట్ల వరకు కోత పడనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు, వాటిల్లో ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని శనివారం అర్ధరాత్రి వరకు కాలేజీ యాజమాన్యాలు ఉత్కంఠతో ఎదురుచూశాయి.
అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ప్రకటన ఇదిగో అదిగో అని చెప్పినా.. అర్ధరాత్రి వరకు జారీ కాలేదు. ఫీజుల జీవోదీ అదే పరిస్థితి. అర్ధరాత్రి వరకు అధికారులు కాలేజీ వారీగా ఫీజులను పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం ఉదయమే ఫీజుల జీవో, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.