కొత్త ప్రభుత్వం... బడ్జెట్‌లో వరాలు కురిపిస్తుందని...ఏదో మేలు చేస్తుందని ఆశిస్తే...పెద్దగా మెరుపులే కనిపించనివ్వలేదు. సగటు జీవి ఆశలకు... ఆకాంక్షలకు దూరంగా ఉండిపోయింది. సామాన్యులు... వేతన జీవులు బడ్జెట్ గురించి ఆలోచించే అవకాశమే కల్పించలేదు. ఊహించలేని వస్తువుల ధరలు తగ్గించి... నిత్యమూ వినియోగించే వాటిని పట్టించుకోలేదనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.
దీర్ఘకాలిక ప్రయోజనాల పేరిట కల్పించే అవకాశాలు కొంతవరకూ ఊరటనిస్తున్నాయి. కాకపోతే ఇవి ఇప్పటికిప్పుడు సాకారమయ్యే అవకాశాలు లేవు.
సామాన్య, మధ్య తరగతి వర్గాలు విరివిగా వినియోగించే రేడియో క్యాబ్స్ చార్జీలకు రెక్కలు రానున్నాయి. బడ్జెట్ ప్రభావంతో ఈ చార్జీలు 8 నుంచి 10 శాతం పెరగవచ్చని క్యాబ్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సిగరెట్లు, పాన్ మసాలాల ధరలు మరింత పెరగనున్నాయి. నగరంలోని ధూమపాన, పాన్‌మసాలాల వినియోగదారులపై సుమారు రూ.20 కోట్ల భారం పడనుందని ఆర్థిక నిపుణుల అంచనా.
ఎలక్ట్రికల్ కార్లు, బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల 15 నుంచి 20 శాతం వరకు ఉండొచ్చని అంచనా. తద్వారా వీటి విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. విమానాశ్రయాల్లోనే వీసాలకు అవకాశం కల్పించడంతో పర్యాటకుల సంఖ్య పెరిగే వీలుంది.కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగమనే ప్రకటన వేలాది కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీకీ అవకాశం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.80 ఏళ్లు దాటిన వారికి రూ.30 వేల వరకూ వైద్య ఖర్చులను భరించనుండడం ఊరటనిచ్చే అంశం. ‘నయా మంజిల్’ రుణ పథకం ద్వారా హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల్లోని దాదాపు ఏడు లక్షల మంది ముస్లిం మైనార్టీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని అంచనా.
సంపన్నులకు మాత్రమే పరిమితమైన వజ్రాలు, రత్నాలు ఇకపై ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా కొనుగోలు చేసే అవకాశం లభించింది.
పట్టణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం... గృహ నిర్మాణానికి రూ. 22వేల కోట్లకు పైగా బడ్జెట్‌లోకేటాయించడంతో నగరానికి వాటా లభించగలదనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అధికాదాయ వర్గాలకు గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేతతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని దాదాపు నాలుగున్నర లక్షల కుటుంబాలపై ప్రభావం పడబోతోంది.
సెట్ అప్ బాక్స్‌ల ధరలు పెరగనున్నాయి. నగర శివార్లలో ఇంకా వీటిని ఏర్పాటు చేసుకోని సుమారు 6 లక్షల కుటుంబాలపై సెట్ అప్ బాక్స్‌ల భారం పడనుంది. లక్ష కి.మీ.ల మేర రహదారుల నిర్మిస్తామని ప్రస్తావించడంతో వాటిలో నగరానికి కొన్నయినా రావచ్చని అంచనా.సంపన్నులు, ఎగువ మధ్య తరగతి వర్గాలు వినియోగించే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు, విదేశీ కార్ల ధరలు పెరుగనున్నాయి. ఇది అమ్మకాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది.
గ్రేట్ నిరాశ / ఆశ
Published Sat, Feb 28 2015 11:42 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement