
ఇసుక కోసం ఎడ్లబండ్లా!
సొంత అవసరాలకు ఎడ్లబండ్లలోనే ఇసుక తీసుకెళ్లాలన్న షరతుపై ప్రజల్లో ఆగ్రహం
ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడా కనిపించని ఎడ్లబండ్లు
ఇప్పుడు ఇసుకకోసం వాటిని తయారు చేయించుకోవాలా?
ఎడ్లను ఎక్కడ తెచ్చుకోవాలని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఇల్లు కట్టుకోవడం, మరుగుదొడ్డి నిర్మాణం లాంటి సొంత అవసరాలకు రేవులనుంచి ఇసుకను తెచ్చుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన తాజా షరతుపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సొంత అవసరాల కోసం ఎడ్లబండ్లలోనే ఇసుకను తీసుకెళ్లాలన్న ఈ షరతు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకను తెచ్చుకునేందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఎడ్లబండ్లను కొనుక్కోవాలా? అని గ్రామీణ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇసుకకోసం ఎడ్లబండ్లను తయారు చేయించుకోవాలా? బండ్లు లాగేందుకు ఎడ్లను ఎక్కడ తెచ్చుకోవాలి? వాటికి పశుగ్రాసం ఎక్కడ తేవాలి? ఎడ్లను ఇప్పటికిప్పుడు పుట్టిస్తారా? అంటూ పేద, మధ్య తరగతి ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ సర్కారు ఇసుక ధరను భారీగా పెంచిన నేపథ్యంలో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, బలహీన వర్గాలవారు ఇసుక కొనలేక ఇళ్ల నిర్మాణాల స్వస్తి చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానికులు సొంత వినియోగంకోసం అధికారుల నుంచి పర్మిట్లు తీసుకుని.. సీనరేజి ఫీజు చెల్లించి వాగులు, వంకలు లాంటి థర్డ్ ఆర్డర్ క్వారీల(రేవుల) నుంచి ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తాజాగా రూపొందించిన ఇసుక పాలసీలో పేర్కొంది.
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ వెసులుబాటు ఉంది. టీడీపీ వచ్చాక డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయ బాధ్యతలు అప్పగించినప్పుడు దీన్ని తొలగించింది. విమర్శల నేపథ్యంలో కొత్త పాలసీ లో ఈ వెసులుబాటును మళ్లీ కల్పించిన ప్రభుత్వం ఎడ్లబండ్లలోనే ఇసుక తీసుకెళ్లాలనే మెలిక పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఇది ఒక చేత్తో నీటి చెంబిచ్చి నోటితో కాకుండా ముక్కుతోనే తాగాలని ముల్లుకర్ర పట్టుకుని చెప్పినట్టుగా ఉంది’ అని ప్రజలతోపాటు వివిధ శాఖల అధికారులూ అంటుండడం గమనార్హం.
ఎడ్లబండ్లు ఎక్కడున్నాయ్?
ప్రస్తుతం పల్లెల్లో ఎడ్లబండ్లు బాగా తగ్గిపోయాయి. అత్యధిక రైతుల ఇళ్లల్లో దాదాపుగా ఎడ్లు, ఎడ్లబండ్లు లేనేలేవు. దుక్కి దున్నడం మొదలు ఎరువు తోలడం, వ్యవసాయ ఉత్పత్తులను ఇళ్లకు తరలించడం లాంటి అన్ని పనులకు రైతులు ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమూ వ్యవసాయానికి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, యాంత్రీకరణ పెంచుకోవాలని చెబుతోంది.
ఇదేబాటలో రైతులు కూడా ఎడ్లకు, ఎడ్లబండ్లకు స్వస్తి చెప్పి అన్ని అవసరాలకు ట్రాక్టర్లనే వాడుతున్నారు. దీంతో ఎడ్లబండ్లు, ఎడ్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లు వాడాలని నిబంధన పెట్టడం వెనుక అంతరార్థమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అవసరాలకు సైతం తక్కువ వ్యయంతో ఎవరూ ఇసుక తీసుకెళ్లేందుకు ఆస్కారం లేకుండా చేయడం.. క్యూబిక్ మీటరు ఇసుకను తప్పనిసరిగా రూ.500కు కొనేలా చేయడమే దీని వెనకున్న పరమార్థమని అధికారులే చెబుతున్నారు.