
గృహిణి సజీవ దహనం
=ఆత్మహత్య చేసుకుందంటున్న భర్త
= అల్లుడే నిప్పుపెట్టాడంటున్న మామ
ఆటోనగర్, న్యూస్‌లైన్: అనుమానాస్పదస్థితిలో ఓ గృహిణి సజీవదహనమైంది. ఆత్మహత్మ చేసుకుందని భర్త చెప్తుండగా... అల్లుడే తమ కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనస్థలిపురం పోలీసులు, మృతురాలి భర్త కథనం ప్రకారం...
ఖమ్మం జిల్లాకు చెందిన గుంపులి స్వప్నకు కర్నూల్ జిల్లాకు చెందిన కిరణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి రెండేళ్ల పాప ఉంది. ప్రస్తుతం వీరు వనస్థలిపురం గాంధీనగర్‌లో ఉంటున్నారు. స్వప్న బీటెక్.. కిరణ్ ఎంబీఏ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా, భర్తతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన స్వప్న శనివారం ఉదయం 6 గంటలకు పడకగది నుంచి వేరే గదిలోకి వెళ్లింది. తలుపులు వేసుకొని ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
విషయం గమనించిన భర్త వెంటనే గది తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో కిటికీ అద్దాలు పగలగొట్టి రక్షించేందుకు ప్రయత్నించాడు. తర్వాత ఇరుగు పొరుగు సహాయంతో తలుపులను పూర్తిగా ధ్వంసం చేసి లోపలికి వెళ్లే సరికి స్వప్న పూర్తిగా కాలి బూడిదై ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, కిరణే తన కూతురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని స్వప్న తండ్రి వీరాస్వామి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.