
తల్లీ కూతుళ్ల బలవన్మరణం
ఘట్‌కేసర్/బచ్చన్నపేట : ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఓ తల్లి.. తన కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథ నం ప్రకారం.. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌కు చెందిన స్వప్న(25)కు కూతురు శాన్వీ(3), కుమారుడు శ్యాం ఉన్నారు. వీరు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నివసిస్తు న్నారు. సోమవారం స్వప్న తన కూతురితో కలిసి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇదిలాఉండగా సాయంత్రం ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర రైల్వే ట్రాక్‌పై తల్లీకూతురు విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్‌పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. ముఖం గుర్తించలేని స్థితిలో ఉంది. చిన్నారికి కూడా గాయాలు ఉన్నాయి. దీంతో తల్లీకూతుళ్లు గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామారావు తెలిపారు.