ప్రేమించిన వ్యక్తి పెళ్లికి సమయం కోరడంతో.. మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఓ కూతురు ఉంది. గత కొన్ని రోజులుగా భర్తతో గొడవపడి తల్లి వద్దే ఉంటున్న స్వప్న ఇంటి పక్కనే ఉంటున్న విష్ణు అనే యువకుడిని ప్రేమించింది.
రెండేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో విష్ణు పెళ్లి ప్రయత్నాలు చేస్తుండటంతో.. ‘తననే పెళ్లి చేసుకోవాలని.. లేకపోతె చచ్చిపోతానని’ పలుమార్లు బెదిరించింది. ఈ విషయమై గతంలో పంచాయతి కూడా జరిగింది. అయినా తీరు మార్చుకోని స్వప్న పెళ్లి చేసుకోవాల్సిందిగా విష్ణు వెంటపడింది. దీనికి అతను తన ఇంట్లో పెళ్లి కావాల్సిన అన్నయ్య ఉన్నాడని అతని పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అయినా సంతృప్తి చెందని స్వప్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.