ఏమైందో.. ఏమో?! | Busy City Life | Sakshi
Sakshi News home page

ఏమైందో.. ఏమో?!

Published Mon, Nov 18 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

Busy City Life

అనుమాన భూతం
 =గజి‘బిజీ’ నగర జీవితం  
 =ఆరోగ్యంపై తరచూ అపోహలు
 =చీటికీ మాటికీ వైద్యుల వద్దకు పరుగు
 =తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా సందేహమే!
 =లేని రోగాలు ఉన్నట్టు భావన
 =రెండోసారి పరీక్షలకు క్యూ కడుతున్న వైనం
 =‘మున్‌చౌసన్ సిండ్రోమ్’ అంటున్న వైద్యులు

 
సాక్షి, సిటీబ్యూరో: ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఉరుకుల పరుగుల జీవితం. అలుపొచ్చినా.. కాస్తంత నలతగా ఉన్నా.. ఏదో అనారోగ్య సమస్య తలెత్తిందేమోనని అనుమానం.. దీనికి తోడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఆరోగ్య కథనాలు, కార్యక్రమాలు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు అవే లక్షణాలు మనకీ ఉన్నాయేమోనని అపోహపడటం.. వాటిని ఊహించుకుని అనుమానంతో ఆందోళనకు గురికావడం.. తమ పరిచయస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే అటువంటి రోగ లక్షణాలు మనకూ ఉన్నాయేమోనని భావించుకోవడం... ఇటువంటి మానసిక ప్రవృత్తి క్రమంగా రుగ్మతగా మారుతోందని వైద్యులు అంటున్నారు.

ఫలితంగా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకున్నా పదేపదే వైద్య పరీక్షలు చేయించుకోవడం పరిపాటైంది.  తరచూ పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యస్పృహగా భావించినా.. పలువురు వైద్యులను సంప్రదిస్తూ, పలు పరీక్షలు చేయించుకోవడం మాత్రం మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తమ వద్దకు అనుమానం జబ్బుతో పరుగెత్తుకుని వస్తున్న వారి నుంచి ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులు ఇదే అదనుగా దోచుకుంటున్నారు.

అసలు అనుమానాలకు తోడు మరికొన్ని అపోహలు కలిగిస్తూ ఎందుకైనా మంచిదనే ‘సలహా..సూచన’లతో రకరకాల ప్యాకేజీలను అంటగడుతున్నారు. చిన్నచిన్న అనారోగ్య లక్షణాలకు కూడా సీటీ స్కాన్ తీస్తూ.. రకరకాల పరీక్షలు చేసి భారీగా ఫీజులు గుంజుతున్నారు. లేని రోగాలను ఊహించుకుని, అనుమానంతో బెంబేలెత్తిపోతూ ఇలా తరచూ పరీక్షలు చేయించుకోవడాన్ని వైద్య పరిభాషలో ‘మున్‌చౌసన్ సిండ్రోమ్’గా నిపుణులు వ్యవహరిస్తున్నారు. నగరంలో ప్రతి వంద మందిలో 20 శాతం మంది రెండోసారి పరీక్షలు చేయించుకుంటున్నట్టు ఓ అంచనా.
 
రిపోర్టులపై నమ్మకం కుదిరే వరకు..

తనకేదో జబ్బు ఉందని భావించినవారు వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, అక్కడితో ఆగక వైద్యుడు చెప్పినట్లు తనలో ఆ సమస్య ఉందో లేదోనని సెకండ్ ఒపీనియన్ కోసం నిమ్స్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్క హృద్రోగ విభాగానికే రోజుకు 20కి పైగా కేసులు వస్తుండడం గమనార్హం. ఇక మూత్రపిండాల విభాగానికి ఇలాంటి కేసులకు లెక్కే లేదు. ఓపీకి వస్తున్న ఆరోగ్యశ్రీ బాధితుల్లో సగంమంది వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకే వస్తున్నారు.

ఒకసారి వచ్చిన రిపోర్టులపై నమ్మకం లేక మరోసారి పరీక్షించాలని డయాగ్నొస్టిక్స్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. తనకు వ్యాధి ఉందని ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే సర్జరీలకు అంగీకరిస్తున్నామని నిమ్స్ మూత్రపిండాల విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్‌రాజు చెప్పారు. కొంత మంది వారికి ఎలాంటి జబ్బు లేకపోయినా తమకేదో అయిపోతుందనే అపోహతో వైద్యులు సూచించకపోయినా నేరుగా  డయాగ్నోస్టిక్ సెంటర్లలో మాస్టర్ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటున్నారు.
 
 అనుమానంతో పరీక్షలు..

 అన్ని రంగాల ఉద్యోగుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. సాధారణ ఛాతి నొప్పికి కూడా టీఎంటీ, యాంజియోగ్రామ్ వంటి ఖరీదైన టెస్టులు సిఫార్సు చేస్తుండటం కూడా వారిలో అనుమానాలకు తావిస్తోంది. ఉన్నత చదువులు చదివి ఆరోగ్య స్పృహ ఉన్నవారిలోనే ఈ అనుమానం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అపోహలతో భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు ముందే వచ్చేస్తున్నాయి.
 - డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మానసిక నిపుణుడు, స్టార్ హాస్పిటల్
 
 మళ్లీ మళ్లీ వస్తున్నారు..
 ఒకసారి పరీక్షించి జబ్బు లేదని నిర్ధారించిన తర్వాత అదే రోగి వారం తిరక్కుండానే ఓపీకి వచ్చి మళ్లీ టెస్టులు రాయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఐటీ అనుబంధ రంగంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులూ ఇలాగే ఉంటున్నారు. టెస్టులకు నిరాకరిస్తే మరో వైద్యుడిని ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ, అదే అనుమానపు జబ్బు ముదిరితే దానికి ఏ మందులు పనిచేయవు.
 - ప్రొఫెసర్ శ్రీభూషణ్‌రాజు, మూత్రపిండాల విభాగాధిపతి, నిమ్స్
 
 ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ..
 గతంతో పోలిస్తే నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. అయితే, ఆరోగ్యంపై పెరుగుతున్న అనుమానం, మితిమీరిన జాగ్రత్తలు కొత్త అనర్థాలకు దారి తీస్తున్నాయి. తుమ్మినా, దగ్గినా వెంటనే వైద్యుడి వ ద్దకు వెళ్లిపోతున్నారు. తనకు ఏదో జరిగిపోతుందనే ఆందోళనతో అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ అనుమానంతో వైద్యుల చుట్టూ తిరిగితే మాన సిక రుగ్మతగా మారే ప్రమాదం ఉంది.
 - ప్రొఫెసర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement