Diagnostic
-
రోగికి కావల్సిన అసలైన మందు అదే..!
ఇంట్లో ఒక్కరు అనారోగ్యం బారిన పడినవారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతుంటారు. జబ్బున పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా.. సమస్యను నివారించే ఉపాయాలు.. సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు.. ఎదుర్కొనే విధానాలు... వీటన్నింటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండచ్చు. ఈ ఏడాది పేషెంట్ సేఫ్టీ డే థీమ్ ‘రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేయడం.’ ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ‘రోగనిర్ధారణ అవకాశాలు మెరుగుపరచడం, పరిష్కరించడం’లో ఆగ్నేయాసియా వెనకంజలో ఉందని డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ సైమా వాజెద్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021–2030 అమలును అంచనా వేయడానికి గ్లోబల్ మెంబర్ స్టేట్ సర్వేలో కేవలం 47 శాతం దేశాలు మాత్రమే రోగనిర్ధారణ బాధ్యతలను తీసుకుంటున్నాయని తెలిసింది.నిర్ధారణ ముఖ్యం..ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో నిర్వహించిన సమావేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచ పేషెంట్స్సేఫ్టీ డేని ప్రారంభించింది. రోగి భద్రత ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే గుర్తు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోగి భద్రత ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడమే ఈ సేఫ్టీ డే లక్ష్యం. ఇందులో రోగులతోపాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎన్జీవోల నుంచి నిపుణులు, రోగులు లేదా వారి కుటుంబీకులు, ప్రతినిధులను ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో ‘రోగనిర్ధారణ ప్రాముఖ్యత’ను చర్చించాలని సూచించింది.అత్యవసర సేవలుఅత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచు వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50 శాతానికి పైగా మరణాలు, 40 శాతానికి పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమష్టి బాధ్యత అని తెలియజేసింది. ‘‘మేం ఇప్పుడు 600 మంది మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్‌కు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాం. కొంతమంది హాస్పిస్‌లో ఉండి సేవలు పొందుతున్నారు. రోగులకు ఇచ్చే సేవ, సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగానూ ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళనను తగ్గించుకోవడంతో బాటు రోగికి కావాల్సిన ప్రశాంత వాతావరణం, వాడాల్సిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. చెప్పిన సూచనలను పాటిస్తూ ఉండటం వల్ల ఆ పేషెంట్స్ కూడా భద్రతను పీలవుతారు. అది వారి ఆయుష్షునూ పెంచుతుంది.అవగాహనతో ..వీటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబసభ్యులకు చెబుతున్నాం. కౌన్సెలింగ్స్ ఇస్తున్నాం. రొమ్ము కేన్సర్‌తో ఇటీవల ఒకామె చనిపోయింది. ఆమె కూతురుకు 22 ఏళ్లు. పెళ్లయ్యింది. కానీ, ఆమె భర్త ఈ అమ్మాయికి కూడా తల్లికి మాదిరే కేన్సర్ వస్తుందేమో అనే అనుమానంతో ఆమెను వదిలేశాడు. దీంతో ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశాం. కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పాం. ఇప్పుడా అమ్మాయి ఆరోగ్యంగా, భరోసాతో కూడిన జీవనం గడుపుతోంది.మొదటి దశలోనే గుర్తిస్తే..వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది ఆ పేషెంట్‌నే కాదు వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలూ ఉన్నాయి. ముందస్తుగా చేయించుకోవాల్సిన వాక్సినేషన్లు, వాడాల్సిన మందులు, జాగ్రత్తల గురించీ వివరిస్తున్నాం. దీర్ఘకాలిక జబ్బులు, పేషెంట్స్‌ను చూసుకోవాల్సి విధానం గురించి తెలుసుకోవాలనుకునే వారికి తగిన అవగాహన కల్పించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని వివరించారు శారద లింగరాజు.మరణం అంచుల్లో ఉన్న రోగులకు తమ స్పర్శ ద్వారా భరోసాను కల్పిస్తోంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ కేంద్రం. ప్రధానంగా కేన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తున్నారు ఇక్కడి నిపుణులు, స్వచ్ఛంద సేవకులు. వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే సందర్భంగా వీరిని సంప్రదించినప్పుడు శారదా లింగరాజు చెప్పిన వివరాలు ఎంతో మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగిస్తాయి. (చదవండి: గుండె జబ్బులు వచ్చేది ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకే..!) -
హైదరాబాదీలకు గుడ్ న్యూస్; అందుబాటులోకి ఉచిత వైద్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ల పేరిట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నెలకొల్పుతున్న వైద్య పరీక్షల కేంద్రాలు నగరంలో మరో 10 ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్‌లు కొన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండడం వల్ల మరో 10 కొత్తగా నెలకొల్పారు. ఇప్పటికే 319 బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుండగా కొత్తగా ఏర్పాటైన వాటిని 151 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలో రోగులు వినియోగించుకోనున్నారు. ఎక్కడికక్కడే.. వైద్య పరీక్షల అవసరాల కోసం కొందరు ప్రైవేట్ ల్యాబ్‌ల మీదా మరికొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి వంటి పెద్దాస్పత్రుల మీద ఆధారపడే పరిస్థితిని నివారించడానికి ఇవి అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను అవసరాన్ని బట్టి వైద్య పరీక్షల కోసం ఈ మినీ హబ్‌లకు సిఫారసు చేస్తారు. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, రేడియోలజీ, రక్తపోటు అనాలసిస్, ఎక్స్‌రే, ఎమ్ఆర్ఐ, సీటీ స్కాన్లు, ఈసీజీ, రేడియాలజీ తదితర సౌకర్యాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి) కొత్త మినీ హబ్స్ అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్ చెరు, మలక్‌పేట్, హయత్‌నగర్, రాజేంద్ర నగర్, గోల్కొండ, నార్సింగి ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. వీటిలో నార్సింగ్‌లో మినీహబ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు లాంఛనంగా బుధవారం ప్రారంభించగా, మిగిలిన వాటిని వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను) -
Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది. ఒమిక్రాన్‌లో వేరియంట్లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్జీన్లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్‌గా నిర్ధారిస్తారు. సింథటిక్ డీఎన్ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఐసీఎంఆర్ అనుమతి లభించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే మరింత విరివిగా, తొందరగా ఫలితాలు రాబట్టవచ్చని అధికారుల అంచనా. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ -
సర్కారీ ఆస్పత్రులు.. కార్పొరేట్ బందీలు!
ఒక్కొక్కటీ అప్పగించేందుకు యత్నాలు నిన్న డయాగ్నోస్టిక్ సేవలు.. ప్రస్తుతం ఐసీయూలు వెల్లువెత్తుతున్న విమర్శలు సర్కారీ ఆస్పత్రులు కార్పొరేట్ల చేతుల్లో బందీలు కానున్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సరైన వైద్యం అందడం లేదని సాకు చూపుతూ కార్పొరేట్ల వైపు మొగ్గు చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ (వ్యాధి నిర్ధారణ) సేవలను ప్రైవేటుకు అప్పగించిన ప్రభుత్వం తాజాగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లనూ కార్పొరేట్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యుడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో నడుస్తున్న విభాగాలే నిదర్శనమని పలువురు చెపుతున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... ఐదేళ్ల కిందట ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ సేవలను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ చేయాలనే ఉద్దేశంతో వాటిని నెలకొల్పారు. కానీ అక్కడ నిరుపేదల కంటే ఉన్నత వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్నవారు సైతం ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చే సీఎంసీవో రిఫరల్ లేఖతో డయాలసిస్ చేయించేస్తున్నారు. దీంతో నిరుపేదలకు డయాలసిస్ అవసరమైతే ఖాళీ లేదని పంపించేస్తున్నారు. సూపరింటెండెంట్ చెప్పినా వినని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఐసీయూలను అప్పగించినా ఇదే పరిస్థితి తలెత్తుతుందనే వాదన వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది లేకుండా సేవలెలా... ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా, వైద్యం అందడం లేదనడం సరికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు కల్పించి, వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపితే కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందుతాయనేది నిపుణుల వాదన. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలైన ఎయిమ్స్, నిమ్హాన్స్, నిమ్స్ వంటి సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడవటం లేదా, వాటిని ఏవైనా కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. అత్యసవర సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న వాదన అశాస్త్రీయమైనదని పేర్కొంటున్నారు. తగిన నిధులు విడుదల చేసి, సిబ్బందిని కేటాయిస్తే మన రాష్ట్రంలోని ఆస్పత్రులు సైతం ఆ స్థాయిలో నిర్వహించ వచ్చని చెపుతున్నారు. విడతల వారీగా కార్పొరేట్ చేతుల్లోకి... మొన్న జిల్లా కేంద్ర ఆస్పత్రులను క్లినికల్ అటాచ్మెంట్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పజెప్పారని, నిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలను మెడాల్‌కు, రేడియాలజీ సేవలను కృష్ణా డయాగ్నోస్టిక్‌కు ఇచ్చారని, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల వంతు వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రులను ఒక్కసారిగా ప్రైవేటుపరం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్లు అర్థమవుతోందని చెబుతున్నారు. కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నమే ప్రభుత్వాస్పత్రుల్లోని విభాగాలను విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగించడమంటే వారికి దోచిపెట్టడమే అవుతుంది. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపి, అత్యాధునిక పరికరాలు సమకూర్చి, నిధులు కేటాయిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. - డాక్టర్ ఎం.కిరణ్, ప్రజా ఆరోగ్య వేదిక ఉపాధ్యక్షుడు సేవా దృక్పథం ఉండదు ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించటం సరైన చర్య కాదు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారు. బయట ఆస్పత్రుల్లో పనిచే స్తే రూ.లక్షల్లో జీతాలు వచ్చే అవకాశం ఉన్నా, ఇక్కడ ఇచ్చే అరకొర జీతాలకు సూపర్ స్పెషలిస్టులు కూడా సేవ చేయాలనే పనిచేస్తున్నారు. వారికి కాదని, లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు అప్పగిస్తే వైద్యం వ్యాపారంగా మారుతుంది. - డాక్టర్ పవన్‌కుమార్, టీచింగ్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి -
ప్రైవేటుకు ‘డయాగ్నస్టిక్’లపై పునరాలోచన
♦ నిధులు పక్కదారి పడతాయన్న విమర్శలతో వెనక్కి తగ్గిన సర్కారు ♦ పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే.. ♦ జిల్లా, ఆపై స్థాయి ఆస్పత్రుల్లో మాత్రం ప్రైవేటుకు ఇవ్వాలనే యోచన ♦ వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొల్పాలనుకున్న డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తం కావడం, అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో... ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి... జిల్లా, బోధనాస్పత్రుల వంటి వాటిలో ప్రైవేటుకు అప్పగిస్తే సరిపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం వెలువరించనుంది. అన్ని ఆసుపత్రుల్లోనూ.. పీహెచ్‌సీల నుంచి రాష్ట్రస్థాయి ఆసుపత్రుల వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, మందులు సరఫరా చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది. ఇందుకు నిధులను ఎన్హెచ్ఎం ఇస్తున్నా... డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తంగా ప్రైవేటు ఏజెన్సీకే అప్పగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తొలుత ‘ప్రైవేటు’ బాట పట్టాలనే నిర్ణయిం చింది. కానీ విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విషయంలో ఒకట్రెండు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ వారం పది రోజుల్లో ఒక కీలక నిర్ణ యం తీసుకుని మార్గదర్శకాలు ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో.. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రైవేటు ఏజెన్సీలకు డయాగ్నస్టిక్‌లు అప్పగిస్తే వాటిని పర్యవేక్షించే పరిస్థితి ఉంటుందా అని అధికారులకు సందేహం తలెత్తింది. ‘ప్రైవేటు’కు అప్పగిస్తే వైద్య సిబ్బందితో కుమ్మక్కై... వైద్య పరీక్షలు చేయకుండానే చేసినట్లు చూపితే నిధులు పక్కదారి పడతాయని కొందరు అధికారులు సర్కారు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రభుత్వమే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పి, ఇప్పటికే ఉన్న టెక్నీషియన్స్‌తో నడిపించాలని యోచిస్తున్నట్లు శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రూ. 4 లక్షలు విలువచేసే ఒక ఆటోమేటిక్ వైద్య పరీక్షల యంత్రాన్ని ఏర్పాటు చేస్తే... రక్త, మూత్ర పరీక్షలను ఆటోమేటిక్‌గా చేసి రిపోర్టులు ఇస్తుందని చెప్పారు. ఆ యంత్రం కూడా ఆస్పత్రిలోనే ఉండిపోతుందని పేర్కొన్నారు. ఇక జిల్లా, బోధనాసుపత్రులు, ఆపై స్థాయి ఆసుపత్రుల్లో మాత్రం డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించాలని యోచిస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ ఇబ్బంది కాదని... చిన్న, పెద్ద అని కాకుండా ప్రతీ వైద్య పరీక్షకు నిర్ణీత సొమ్మునే చెల్లించాలని భావిస్తున్నారు. రక్త పరీక్ష చేసినా, అధిక ఖర్చయ్యే బయాప్సీ పరీక్ష చేసినా అన్నింటికీ రూ. 230 చొప్పున ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిం ది. వాస్తవానికి ఉచిత వైద్య పరీక్షలు, మం దుల కోసం రూ.70 కోట్ల మేరకు ఎన్హెచ్ఎం కేటాయించనుందని సమాచారం. వైద్య ఉద్యోగ సంఘాలు, కొందరు అధికారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్‌లు నెలకొల్పాలని కోరుతున్నారు. -
ఏమైందో.. ఏమో?!
అనుమాన భూతం =గజి‘బిజీ’ నగర జీవితం =ఆరోగ్యంపై తరచూ అపోహలు =చీటికీ మాటికీ వైద్యుల వద్దకు పరుగు =తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా సందేహమే! =లేని రోగాలు ఉన్నట్టు భావన =రెండోసారి పరీక్షలకు క్యూ కడుతున్న వైనం =‘మున్‌చౌసన్ సిండ్రోమ్’ అంటున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఉరుకుల పరుగుల జీవితం. అలుపొచ్చినా.. కాస్తంత నలతగా ఉన్నా.. ఏదో అనారోగ్య సమస్య తలెత్తిందేమోనని అనుమానం.. దీనికి తోడు ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఆరోగ్య కథనాలు, కార్యక్రమాలు చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు అవే లక్షణాలు మనకీ ఉన్నాయేమోనని అపోహపడటం.. వాటిని ఊహించుకుని అనుమానంతో ఆందోళనకు గురికావడం.. తమ పరిచయస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే అటువంటి రోగ లక్షణాలు మనకూ ఉన్నాయేమోనని భావించుకోవడం... ఇటువంటి మానసిక ప్రవృత్తి క్రమంగా రుగ్మతగా మారుతోందని వైద్యులు అంటున్నారు. ఫలితంగా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకున్నా పదేపదే వైద్య పరీక్షలు చేయించుకోవడం పరిపాటైంది. తరచూ పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యస్పృహగా భావించినా.. పలువురు వైద్యులను సంప్రదిస్తూ, పలు పరీక్షలు చేయించుకోవడం మాత్రం మానసిక సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తమ వద్దకు అనుమానం జబ్బుతో పరుగెత్తుకుని వస్తున్న వారి నుంచి ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులు ఇదే అదనుగా దోచుకుంటున్నారు. అసలు అనుమానాలకు తోడు మరికొన్ని అపోహలు కలిగిస్తూ ఎందుకైనా మంచిదనే ‘సలహా..సూచన’లతో రకరకాల ప్యాకేజీలను అంటగడుతున్నారు. చిన్నచిన్న అనారోగ్య లక్షణాలకు కూడా సీటీ స్కాన్ తీస్తూ.. రకరకాల పరీక్షలు చేసి భారీగా ఫీజులు గుంజుతున్నారు. లేని రోగాలను ఊహించుకుని, అనుమానంతో బెంబేలెత్తిపోతూ ఇలా తరచూ పరీక్షలు చేయించుకోవడాన్ని వైద్య పరిభాషలో ‘మున్‌చౌసన్ సిండ్రోమ్’గా నిపుణులు వ్యవహరిస్తున్నారు. నగరంలో ప్రతి వంద మందిలో 20 శాతం మంది రెండోసారి పరీక్షలు చేయించుకుంటున్నట్టు ఓ అంచనా. రిపోర్టులపై నమ్మకం కుదిరే వరకు.. తనకేదో జబ్బు ఉందని భావించినవారు వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, అక్కడితో ఆగక వైద్యుడు చెప్పినట్లు తనలో ఆ సమస్య ఉందో లేదోనని సెకండ్ ఒపీనియన్ కోసం నిమ్స్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్క హృద్రోగ విభాగానికే రోజుకు 20కి పైగా కేసులు వస్తుండడం గమనార్హం. ఇక మూత్రపిండాల విభాగానికి ఇలాంటి కేసులకు లెక్కే లేదు. ఓపీకి వస్తున్న ఆరోగ్యశ్రీ బాధితుల్లో సగంమంది వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకే వస్తున్నారు. ఒకసారి వచ్చిన రిపోర్టులపై నమ్మకం లేక మరోసారి పరీక్షించాలని డయాగ్నొస్టిక్స్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. తనకు వ్యాధి ఉందని ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే సర్జరీలకు అంగీకరిస్తున్నామని నిమ్స్ మూత్రపిండాల విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్‌రాజు చెప్పారు. కొంత మంది వారికి ఎలాంటి జబ్బు లేకపోయినా తమకేదో అయిపోతుందనే అపోహతో వైద్యులు సూచించకపోయినా నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లలో మాస్టర్ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటున్నారు. అనుమానంతో పరీక్షలు.. అన్ని రంగాల ఉద్యోగుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. సాధారణ ఛాతి నొప్పికి కూడా టీఎంటీ, యాంజియోగ్రామ్ వంటి ఖరీదైన టెస్టులు సిఫార్సు చేస్తుండటం కూడా వారిలో అనుమానాలకు తావిస్తోంది. ఉన్నత చదువులు చదివి ఆరోగ్య స్పృహ ఉన్నవారిలోనే ఈ అనుమానం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అపోహలతో భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు ముందే వచ్చేస్తున్నాయి. - డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, మానసిక నిపుణుడు, స్టార్ హాస్పిటల్ మళ్లీ మళ్లీ వస్తున్నారు.. ఒకసారి పరీక్షించి జబ్బు లేదని నిర్ధారించిన తర్వాత అదే రోగి వారం తిరక్కుండానే ఓపీకి వచ్చి మళ్లీ టెస్టులు రాయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఐటీ అనుబంధ రంగంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులూ ఇలాగే ఉంటున్నారు. టెస్టులకు నిరాకరిస్తే మరో వైద్యుడిని ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ, అదే అనుమానపు జబ్బు ముదిరితే దానికి ఏ మందులు పనిచేయవు. - ప్రొఫెసర్ శ్రీభూషణ్‌రాజు, మూత్రపిండాల విభాగాధిపతి, నిమ్స్ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ.. గతంతో పోలిస్తే నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. అయితే, ఆరోగ్యంపై పెరుగుతున్న అనుమానం, మితిమీరిన జాగ్రత్తలు కొత్త అనర్థాలకు దారి తీస్తున్నాయి. తుమ్మినా, దగ్గినా వెంటనే వైద్యుడి వ ద్దకు వెళ్లిపోతున్నారు. తనకు ఏదో జరిగిపోతుందనే ఆందోళనతో అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమే కానీ అనుమానంతో వైద్యుల చుట్టూ తిరిగితే మాన సిక రుగ్మతగా మారే ప్రమాదం ఉంది. - ప్రొఫెసర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి -
ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవల బలోపేతానికి కృషి
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవల్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు జి.శాంతారావు చెప్పారు. గురువారం ఆయన కింగ్ జార్జి ఆస్ప త్రి, ఆంధ్ర వైద్య కళాశాలలను సందర్శించారు. కేజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ జి.వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్లతోపాటు అన్ని వైద్య విభాగల అధిపతులతో సమావేశమై వైద్య సిబ్బంది, పరికరాల కొరతపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోగులను బయటకు పంపకుండా చూసేందుకే ఈ సౌకర్యమ న్నారు. అత్యవసర మందులు అం దుబాటులో ఉండేలా చూస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 300 మంది అసిస్టెంట్ల ప్రొఫెసర్ల నియామకానికి సీఎం అనుమతి లభించిందని, ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే భర్తీ చేస్తామని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో నర్సుల కొరత వేధిస్తోందని నర్సుల సంఘం నేతలు ఆయన దృష్టికి తేగా త్వరలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రోగుల వసతి కోసం టి.సుబ్బరామిరెడ్డి నిర్మిస్తున్న డార్మె ట్రీ పనులను డీఎంఈ పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెంట్ బి.ఉదయ్‌కుమార్, ప్రొఫెసర్లు శివకుమార్, సుబ్బారావు, మెట్ట రాజగోపాల్, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్.ఎం.ఓ.శాస్త్రి ఉన్నారు. ఏఎంసీలో రూ.25 కోట్లతో ఎండీఆర్ ల్యాబ్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏఎంసీకి మల్టీ డిసిప్లినరీ రీసెర్చి లేబొరేటరీ (ఎండీఆర్)ని మంజూరు చేసింది. ఈ ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.5 కోట్లు వంతున ఐదేళ్లపాటు నిధులను సమకూరుస్తుందని డీఎంఈ డాక్టర్ శాంతారావు తెలిపారు. -
తప్పుడు రిపోర్టులతో ప్రజలను భయపెట్టొద్దు
దేవునిపల్లి, న్యూస్‌లైన్ :చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వ్యాధులు లేకున్నా పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారని కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎస్పీహెచ్ఓ సురేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీజనల్ వ్యాధుల రక్త పరీక్షలను తప్పుడుగా చేస్తున్నారని, నిర్ధారించుకోకుండానే రిపోర్టులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పట్టణంలోని ల్యాబ్స్, డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులతో సోమవారం ఆర్డీఓ చాంబర్లో సమావేశం నిర్వహించారు. డెంగ్యూ రక్త పరీక్షలు చేయడానికి ఇక్కడ సౌకర్యాలు లేవని, అలాంటప్పుడు ఎలా పాజిటివ్‌గా రిపోర్ట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా తప్పుడు రిపోర్ట్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని హెచ్చరించారు. డెంగ్యూకు సంబంధించినా ఎలిజా మెథడ్ రక్తపరీక్షల కోసం రక్తం నమూనాలను జిల్లా కేంద్రానికి పంపించి, పరీక్ష అనంతరం నిర్ధారణ చేసుకుని రిపోర్ట్‌లను రోగులకు అందజేయాలని స్పష్టంచేశారు. పరీక్షలు సరిగా నిర్వహించకుండా తప్పుడు రిపోర్టులు అందించే ల్యాబ్‌లను సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో సబ్యూనిట్ ఆఫీసర్ బాల్‌చంద్రం, సూపర్వైజర్ చలపతి, ల్యాబ్‌ల నిర్వాహకులు పాల్గొన్నారు.