ఇంట్లో ఒక్కరు అనారోగ్యం బారిన పడినవారుంటే ఆ ఇంట్లో వాళ్లందరూ ఆందోళన చెందుతుంటారు. జబ్బున పడిన మనిషికి ఇవ్వాల్సిన భరోసా.. సమస్యను నివారించే ఉపాయాలు.. సరైన సమయంలో రోగ నిర్ధారణ ఆవశ్యకత, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు..
ఎదుర్కొనే విధానాలు...
వీటన్నింటి పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల భరోసాగా ఉండచ్చు. ఈ ఏడాది పేషెంట్ సేఫ్టీ డే థీమ్ ‘రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను తెలియజేయడం.’ ప్రపంచంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ‘రోగనిర్ధారణ అవకాశాలు మెరుగుపరచడం, పరిష్కరించడం’లో ఆగ్నేయాసియా వెనకంజలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్ డైరెక్టర్ సైమా వాజెద్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లోబల్ పేషెంట్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ 2021–2030 అమలును అంచనా వేయడానికి గ్లోబల్ మెంబర్ స్టేట్ సర్వేలో కేవలం 47 శాతం దేశాలు మాత్రమే రోగనిర్ధారణ బాధ్యతలను తీసుకుంటున్నాయని తెలిసింది.
నిర్ధారణ ముఖ్యం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో నిర్వహించిన సమావేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచ పేషెంట్స్‌సేఫ్టీ డేని ప్రారంభించింది. రోగి భద్రత ప్రాముఖ్యతను ఈ స్పెషల్ డే గుర్తు చేస్తుంది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా రోగి భద్రత ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడమే ఈ సేఫ్టీ డే లక్ష్యం. ఇందులో రోగులతోపాటు వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, నాయకులు, సమాజంలో అందరూ బాధ్యతగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎన్జీవోల నుంచి నిపుణులు, రోగులు లేదా వారి కుటుంబీకులు, ప్రతినిధులను ఒకచోట చేర్చి వివిధ వ్యాధుల నిర్వహణలో ‘రోగనిర్ధారణ ప్రాముఖ్యత’ను చర్చించాలని సూచించింది.
అత్యవసర సేవలు
అత్యవసర సేవలు అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తరచు వింటూనే ఉన్నాం. అత్యవసర సేవలను అందించడం ద్వారా దేశంలో 50 శాతానికి పైగా మరణాలు, 40 శాతానికి పైగా రోగాల భారాన్ని తగ్గించిన వారవుతారని ఎయిమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఆరోగ్య భారతం మనందరి సమష్టి బాధ్యత అని తెలియజేసింది.
‘‘మేం ఇప్పుడు 600 మంది మృత్యుముఖంలో ఉన్న పేషెంట్స్‌కు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాం. కొంతమంది హాస్పిస్‌లో ఉండి సేవలు పొందుతున్నారు. రోగులకు ఇచ్చే సేవ, సంరక్షణ భరోసాతో కూడుకున్నదైతే వారు అంతే ప్రశాంతంగానూ ఉండగలుగుతారు. మరికొందరు వారి కుటుంబ సభ్యుల మధ్యనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఆందోళనను తగ్గించుకోవడంతో బాటు రోగికి కావాల్సిన ప్రశాంత వాతావరణం, వాడాల్సిన మందులు వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. చెప్పిన సూచనలను పాటిస్తూ ఉండటం వల్ల ఆ పేషెంట్స్ కూడా భద్రతను పీలవుతారు. అది వారి ఆయుష్షునూ పెంచుతుంది.
అవగాహనతో ..
వీటితో పాటు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు, అంటువ్యాధులకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కుటుంబసభ్యులకు చెబుతున్నాం. కౌన్సెలింగ్స్ ఇస్తున్నాం. రొమ్ము కేన్సర్‌తో ఇటీవల ఒకామె చనిపోయింది. ఆమె కూతురుకు 22 ఏళ్లు. పెళ్లయ్యింది. కానీ, ఆమె భర్త ఈ అమ్మాయికి కూడా తల్లికి మాదిరే కేన్సర్ వస్తుందేమో అనే అనుమానంతో ఆమెను వదిలేశాడు. దీంతో ఇద్దరికీ కౌన్సెలింగ్ చేశాం. కొన్ని ముందస్తు జాగ్రత్తలు చెప్పాం. ఇప్పుడా అమ్మాయి ఆరోగ్యంగా, భరోసాతో కూడిన జీవనం గడుపుతోంది.
మొదటి దశలోనే గుర్తిస్తే..
వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుంది. అది ఆ పేషెంట్‌నే కాదు వారి కుటుంబాన్ని కూడా కాపాడిన సందర్భాలూ ఉన్నాయి. ముందస్తుగా చేయించుకోవాల్సిన వాక్సినేషన్లు, వాడాల్సిన మందులు, జాగ్రత్తల గురించీ వివరిస్తున్నాం. దీర్ఘకాలిక జబ్బులు, పేషెంట్స్‌ను చూసుకోవాల్సి విధానం గురించి తెలుసుకోవాలనుకునే వారికి తగిన అవగాహన కల్పించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని వివరించారు శారద లింగరాజు.
మరణం అంచుల్లో ఉన్న
రోగులకు తమ స్పర్శ ద్వారా భరోసాను కల్పిస్తోంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్ కేంద్రం. ప్రధానంగా కేన్సర్ రోగులకు సాంత్వన కలిగిస్తున్నారు ఇక్కడి నిపుణులు, స్వచ్ఛంద సేవకులు. వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే సందర్భంగా వీరిని సంప్రదించినప్పుడు శారదా లింగరాజు చెప్పిన వివరాలు ఎంతో మంది రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment