ప్రైవేటుకు ‘డయాగ్నస్టిక్’లపై పునరాలోచన
♦ నిధులు పక్కదారి పడతాయన్న విమర్శలతో వెనక్కి తగ్గిన సర్కారు
♦ పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే..
♦ జిల్లా, ఆపై స్థాయి ఆస్పత్రుల్లో మాత్రం ప్రైవేటుకు ఇవ్వాలనే యోచన
♦ వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొల్పాలనుకున్న డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తం కావడం, అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో... ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి... జిల్లా, బోధనాస్పత్రుల వంటి వాటిలో ప్రైవేటుకు అప్పగిస్తే సరిపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం వెలువరించనుంది.
అన్ని ఆసుపత్రుల్లోనూ..
పీహెచ్‌సీల నుంచి రాష్ట్రస్థాయి ఆసుపత్రుల వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, మందులు సరఫరా చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది. ఇందుకు నిధులను ఎన్‌హెచ్‌ఎం ఇస్తున్నా... డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తంగా ప్రైవేటు ఏజెన్సీకే అప్పగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తొలుత ‘ప్రైవేటు’ బాట పట్టాలనే నిర్ణయిం చింది. కానీ విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విషయంలో ఒకట్రెండు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ వారం పది రోజుల్లో ఒక కీలక నిర్ణ యం తీసుకుని మార్గదర్శకాలు ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో..
పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రైవేటు ఏజెన్సీలకు డయాగ్నస్టిక్‌లు అప్పగిస్తే వాటిని పర్యవేక్షించే పరిస్థితి ఉంటుందా అని అధికారులకు సందేహం తలెత్తింది. ‘ప్రైవేటు’కు అప్పగిస్తే వైద్య సిబ్బందితో కుమ్మక్కై... వైద్య పరీక్షలు చేయకుండానే చేసినట్లు చూపితే నిధులు పక్కదారి పడతాయని కొందరు అధికారులు సర్కారు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రభుత్వమే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పి, ఇప్పటికే ఉన్న టెక్నీషియన్స్‌తో నడిపించాలని యోచిస్తున్నట్లు శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రూ. 4 లక్షలు విలువచేసే ఒక ఆటోమేటిక్ వైద్య పరీక్షల యంత్రాన్ని ఏర్పాటు చేస్తే... రక్త, మూత్ర పరీక్షలను ఆటోమేటిక్‌గా చేసి రిపోర్టులు ఇస్తుందని చెప్పారు. ఆ యంత్రం కూడా ఆస్పత్రిలోనే ఉండిపోతుందని పేర్కొన్నారు. ఇక జిల్లా, బోధనాసుపత్రులు, ఆపై స్థాయి ఆసుపత్రుల్లో మాత్రం డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించాలని యోచిస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ ఇబ్బంది కాదని... చిన్న, పెద్ద అని కాకుండా ప్రతీ వైద్య పరీక్షకు నిర్ణీత సొమ్మునే చెల్లించాలని భావిస్తున్నారు.
రక్త పరీక్ష చేసినా, అధిక ఖర్చయ్యే బయాప్సీ పరీక్ష చేసినా అన్నింటికీ రూ. 230 చొప్పున ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిం ది. వాస్తవానికి ఉచిత వైద్య పరీక్షలు, మం దుల కోసం రూ.70 కోట్ల మేరకు ఎన్‌హెచ్‌ఎం కేటాయించనుందని సమాచారం. వైద్య ఉద్యోగ సంఘాలు, కొందరు అధికారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్‌లు నెలకొల్పాలని కోరుతున్నారు.