తప్పుడు రిపోర్టులతో ప్రజలను భయపెట్టొద్దు
Published Tue, Aug 13 2013 6:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
దేవునిపల్లి, న్యూస్‌లైన్ :చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వ్యాధులు లేకున్నా పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారని కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎస్‌పీహెచ్‌ఓ సురేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీజనల్ వ్యాధుల రక్త పరీక్షలను తప్పుడుగా చేస్తున్నారని, నిర్ధారించుకోకుండానే రిపోర్టులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పట్టణంలోని ల్యాబ్స్, డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులతో సోమవారం ఆర్డీఓ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు.
డెంగ్యూ రక్త పరీక్షలు చేయడానికి ఇక్కడ సౌకర్యాలు లేవని, అలాంటప్పుడు ఎలా పాజిటివ్‌గా రిపోర్ట్‌లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా తప్పుడు రిపోర్ట్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని హెచ్చరించారు. డెంగ్యూకు సంబంధించినా ఎలిజా మెథడ్ రక్తపరీక్షల కోసం రక్తం నమూనాలను జిల్లా కేంద్రానికి పంపించి, పరీక్ష అనంతరం నిర్ధారణ చేసుకుని రిపోర్ట్‌లను రోగులకు అందజేయాలని స్పష్టంచేశారు. పరీక్షలు సరిగా నిర్వహించకుండా తప్పుడు రిపోర్టులు అందించే ల్యాబ్‌లను సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో సబ్‌యూనిట్ ఆఫీసర్ బాల్‌చంద్రం, సూపర్‌వైజర్ చలపతి, ల్యాబ్‌ల నిర్వాహకులు పాల్గొన్నారు.
Advertisement