తెలంగాణకు 421 యోగా కేంద్రాలు మంజూరు
రూ.25.26 కోట్ల నిధుల కేటాయింపు
ఇప్పటి వరకు 289 నిర్మాణాలు పూర్తి
కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలంటూ వినతులు
సాక్షి, సిద్దిపేట: ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా యోగా కేంద్రాల నిర్మాణం జరిగినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 421 ఆయుర్వేద, యునాని, హోమి యోపతి వైద్య,ఆరోగ్య కేంద్రాలకు యోగా కేంద్రాలను మంజూరు చేశారు.
పలు చోట్ల నిర్మా ణాలు పూర్తయినా, శిక్షకులను నియమించకపోవడంతో అవి స్టోర్ రూంలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షకులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు
ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు వీలుగా యోగాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యోగా కేంద్రం షెడ్ నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున రూ 25.26 కోట్ల నిధులు విడుదల చేశారు.
ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలను ఆర్‌అండ్‌బీ, పీఆర్, టీఎస్‌ఎంఐడీసీలకు అప్పగించారు. తెలంగాణవ్యాప్తంగా 421 కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 289 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 42 కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, మరో 90 కేంద్రాలకు స్థల కొరత ఏర్పడింది.
నిర్మాణాలు పూర్తయినా..
యోగా శిక్షణకు షెడ్‌ల నిర్మాణాలు పలు చోట్ల పూర్తయినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని జిల్లాల్లో ఏడాదిన్నర క్రితం నిర్మాణాలు పూర్తయినప్పటికీ యోగా శిక్షకులను నియమించకపోవడంతో అవి తెరుచుకోలేదు. ఈ షెడ్‌లు వినియోగంలో లేకపోవడంతో పలు చోట్ల స్టోర్ రూంలుగా, మరికొన్ని చోట్ల అపరిశుభ్రంగా తయారవుతున్నాయి.
శిక్షకుల నియామకం ఎప్పుడు?
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో యోగా శిక్షణ కేంద్రానికి ఇద్దరు శిక్షకుల చొప్పున నియమించాలని నిర్ణయించారు. అందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు. గత నెలలో యోగా శిక్షకుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహా్వనించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదు. పురుషులకు నెలకు రూ.8 వేలు, మహిళకు రూ.5 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
త్వరలో ప్రారంభిస్తాం
త్వరలో యోగా కేంద్రాలను ప్రారంభిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు శిక్షకుల ఎంపికకు గత నెలలో ఆయా జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. త్వరలో శిక్షకులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తాం. – రవినాయక్, ఆర్‌డీడీ, హైదరాబాద్, ఆయుష్
Comments
Please login to add a commentAdd a comment