ఒక్కొక్కటీ అప్పగించేందుకు యత్నాలు
నిన్న డయాగ్నోస్టిక్ సేవలు.. ప్రస్తుతం ఐసీయూలు
వెల్లువెత్తుతున్న విమర్శలు
సర్కారీ ఆస్పత్రులు కార్పొరేట్ల చేతుల్లో బందీలు కానున్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సరైన వైద్యం అందడం లేదని సాకు చూపుతూ కార్పొరేట్ల వైపు మొగ్గు చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ (వ్యాధి నిర్ధారణ) సేవలను ప్రైవేటుకు అప్పగించిన ప్రభుత్వం తాజాగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లనూ కార్పొరేట్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యుడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో నడుస్తున్న విభాగాలే నిదర్శనమని పలువురు చెపుతున్నారు.
ప్రస్తుతం ఏం జరుగుతోందంటే...
ఐదేళ్ల కిందట ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ సేవలను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ చేయాలనే ఉద్దేశంతో వాటిని నెలకొల్పారు. కానీ అక్కడ నిరుపేదల కంటే ఉన్నత వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్నవారు సైతం ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చే సీఎంసీవో రిఫరల్ లేఖతో డయాలసిస్ చేయించేస్తున్నారు. దీంతో నిరుపేదలకు డయాలసిస్ అవసరమైతే ఖాళీ లేదని పంపించేస్తున్నారు. సూపరింటెండెంట్ చెప్పినా వినని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఐసీయూలను అప్పగించినా ఇదే పరిస్థితి తలెత్తుతుందనే వాదన వినిపిస్తోంది.
వైద్యులు, సిబ్బంది లేకుండా సేవలెలా...
ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా, వైద్యం అందడం లేదనడం సరికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు కల్పించి, వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపితే కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందుతాయనేది నిపుణుల వాదన. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలైన ఎయిమ్స్, నిమ్‌హాన్స్, నిమ్స్ వంటి సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడవటం లేదా, వాటిని ఏవైనా కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. అత్యసవర సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న వాదన అశాస్త్రీయమైనదని పేర్కొంటున్నారు. తగిన నిధులు విడుదల చేసి, సిబ్బందిని కేటాయిస్తే మన రాష్ట్రంలోని ఆస్పత్రులు సైతం ఆ స్థాయిలో నిర్వహించ వచ్చని చెపుతున్నారు.
విడతల వారీగా కార్పొరేట్ చేతుల్లోకి...
మొన్న జిల్లా కేంద్ర ఆస్పత్రులను క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పజెప్పారని, నిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలను మెడాల్‌కు, రేడియాలజీ సేవలను కృష్ణా డయాగ్నోస్టిక్‌కు ఇచ్చారని, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల వంతు వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రులను ఒక్కసారిగా ప్రైవేటుపరం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్లు అర్థమవుతోందని చెబుతున్నారు.
కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నమే
ప్రభుత్వాస్పత్రుల్లోని విభాగాలను విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగించడమంటే వారికి దోచిపెట్టడమే అవుతుంది. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపి, అత్యాధునిక పరికరాలు సమకూర్చి, నిధులు కేటాయిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి.
- డాక్టర్ ఎం.కిరణ్, ప్రజా ఆరోగ్య వేదిక ఉపాధ్యక్షుడు
సేవా దృక్పథం ఉండదు
ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించటం సరైన చర్య కాదు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారు. బయట ఆస్పత్రుల్లో పనిచే స్తే రూ.లక్షల్లో జీతాలు వచ్చే అవకాశం ఉన్నా, ఇక్కడ ఇచ్చే అరకొర జీతాలకు సూపర్ స్పెషలిస్టులు కూడా సేవ చేయాలనే పనిచేస్తున్నారు. వారికి కాదని, లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు అప్పగిస్తే వైద్యం వ్యాపారంగా మారుతుంది.
- డాక్టర్ పవన్‌కుమార్,
టీచింగ్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
సర్కారీ ఆస్పత్రులు.. కార్పొరేట్ బందీలు!
Published Fri, Feb 19 2016 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement