civil hospitals
-
సర్కారీ ఆస్పత్రుల్లో మరణ మృదంగం
- 11 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిలో 42,297 మంది మృతి - సగటున రోజుకు 115 మంది ప్రాణాలు గాలిలో - వెంటిలేటర్లు, మందుల కొరతతో రోగుల మృత్యువాత - ప్రభుత్వ పరిశీలనలో తేలిన చేదు నిజాలు సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రులంటే ప్రాణం పోయాలి... కానీ ఏ ఆస్పత్రికెళ్లినా ఏమున్నది గర్వకారణం...చచ్చేది ఖాయం అన్నట్టుంది పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో పేద రోగులు పెద్దాసుపత్రులకు వెళ్లడం, అక్కడ సరైన వైద్య సేవలు అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం... ఇదీ తంతు. ఎక్కడైనా ఇన్‌పేషెంట్ల సంఖ్యలో రెండు శాతం మృతులు ఉంటేనే చాలా ఎక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఈ మృతుల సంఖ్య ఇన్‌పేషెంట్ల సంఖ్యలో 10 శాతం కంటే ఎక్కువగా ఉండటం అత్యంత పేలవమైన వైద్య సేవలు అందుతున్నట్లు అర్థమవుతోంది. ఓవైపు అన్ని సేవలను ప్రైవేటుపరం చేస్తుండటం, మరోవైపు పలువురు ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్య ధోరణితో ఉండటం వంటి కారణాలు రోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ధర్మామీటర్ కొనుగోలు చేసినా అందులో అవినీతి అక్రమాలే ఉండటం, నాసిరకం కొనుగోలు పరికరాలను కొనుగోలు చేయడం వంటివి రోగులను పట్టి పీడిస్తున్నాయి. వివిధ పెద్దాసుపత్రుల్లో 42,297 మంది మృత్యువాత పడినట్టు పరిశీలనలో వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందినట్లు తెలిసింది. గంటకు 4నుంచి 5 మంది... రోజుకు సగటున 115 మంది రోగులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కనీస వసతులు లేకనే మృతి బోధనాసుపత్రులంటే రాష్ట్ర వైద్యవిద్యకు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆయువుపట్టు లాంటివి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడే వైద్యవిద్య నేర్చుకుంటూంటారు. అలాంటి ఆస్పత్రుల్లోనే కనీస మౌలిక వసతులు లేవు. తీవ్ర గాయాలతో లేదా జబ్బులతో వచ్చిన వారికి వీల్ చైర్లు లేవు. వెంటిలేటర్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. రోజు వస్తున్న పేషెంట్లలో 10 శాతం మందికి మాత్రమే కృత్రిమ శ్వాస అందిస్తున్న పరిస్థితి. ఎంఆర్ఐ, సీటీస్కాన్‌ల విషయంలో అయితే గత మూడు మాసాల్లో రోగులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. అన్నిటికీ మించి రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు లేరు. కనీసం మూడు పడకలకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, 20 పడకలకు కూడా ఒక నర్సు లేదు. ఇక వైద్యుల పరిస్థితీ అంతే. ఇప్పటికీ 160 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు రక్తం కావాలన్నా దొరకని పరిస్థితి. అవినీతికి ఇదో మచ్చుతునక డయాలసిస్ బాధితుల కోసం 400 పడకలు కొన్నారు. రోగిని బరువు చూసి వైద్యమందిస్తారు. దీనికోసం పడకకే వెయింగ్ స్కేల్ (బరువును కొలిచే యంత్రం) ఉన్నది కొనాలి. కానీ ఒక కంపెనీతో ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు కుమ్మక్కై నాసిరకం మంచాలు కొన్నారు. దీంతో ప్రతిసారీ పేషెంటును దించడం, బరువు కొలచడం, మళ్లీ ఎక్కించడం జరుగుతోంది. దీనివల్ల ఒక్కో మంచం కొనుగోలులో రూ.30 వేల తేడా ఉండచ్చుగానీ, వేలాది మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. జబ్బు ముదిరితే చావే గతి... ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న వారిలో మృతి చెందుతున్న వారిని పరిశీలిస్తే... ప్రమాద బాధితులు ఎక్కువమంది మృతి చెందుతున్నారు కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల మృతులు ఏటికేటికీ పెరుగుతున్నట్టు తేలింది శ్వాసకోశ వ్యాధుల బాధితులు ఈ ఏడాది ఎక్కువమంది మృతి చెందారు డెంగీ, గున్యా బాధితులకూ సకాలంలో వైద్యమందక మృతిచెందిన వారిలో ఉన్నారు గుండెజబ్బులతో బాధపడుతున్న వారు ప్రాణాలు వదులుతున్నారు కాలేయ వ్యాధుల మృతులు రెండేళ్లుగా తీవ్రమైనట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది ప్రసవ సమయంలో మృతిచెందుతున్న గర్భిణుల సంఖ్య కూడా వేలల్లో ఉంది 2016లో మృతి చెందిన వారు ఆస్పత్రి - మృతుల సంఖ్య జీజీహెచ్, కాకినాడ- 6,547 జీజీహెచ్, గుంటూరు - 7,940 ఎస్వీఆర్ జీజీహెచ్ తిరుపతి - 4,210 కింగ్‌జార్జి, విశాఖపట్నం - 4,502 రిమ్స్, ఒంగోలు - 1,072 రిమ్స్, శ్రీకాకుళం - 947 జీజీహెచ్, అనంతపురం - 2,618 జీజీహెచ్, విజయవాడ - 3,911 జీజీహెచ్, నెల్లూరు - 1,897 జీజీహెచ్, కర్నూలు - 6,744 రిమ్స్, కడప - 1,909 మొత్తం మృతుల సంఖ్య - 42,297 (ఇవి కాకుండా విశాఖపట్నంలోని ఛాతీ ఆస్పత్రి, గుంటూరు జిల్లా చినకాకాని లోని క్యాన్సర్ ఆస్పత్రిలో 1,200 మందిపైనే మృతి చెందినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అంతేకాదు వైద్యవిధాన పరిషత్‌లోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లోనూ మృతుల సంఖ్య అధికంగా ఉంది) -
సర్కారీ ఆస్పత్రులు.. కార్పొరేట్ బందీలు!
ఒక్కొక్కటీ అప్పగించేందుకు యత్నాలు నిన్న డయాగ్నోస్టిక్ సేవలు.. ప్రస్తుతం ఐసీయూలు వెల్లువెత్తుతున్న విమర్శలు సర్కారీ ఆస్పత్రులు కార్పొరేట్ల చేతుల్లో బందీలు కానున్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సరైన వైద్యం అందడం లేదని సాకు చూపుతూ కార్పొరేట్ల వైపు మొగ్గు చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ (వ్యాధి నిర్ధారణ) సేవలను ప్రైవేటుకు అప్పగించిన ప్రభుత్వం తాజాగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లనూ కార్పొరేట్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సామాన్యుడికి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకు ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో నడుస్తున్న విభాగాలే నిదర్శనమని పలువురు చెపుతున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతోందంటే... ఐదేళ్ల కిందట ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ సేవలను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ చేయాలనే ఉద్దేశంతో వాటిని నెలకొల్పారు. కానీ అక్కడ నిరుపేదల కంటే ఉన్నత వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్నవారు సైతం ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చే సీఎంసీవో రిఫరల్ లేఖతో డయాలసిస్ చేయించేస్తున్నారు. దీంతో నిరుపేదలకు డయాలసిస్ అవసరమైతే ఖాళీ లేదని పంపించేస్తున్నారు. సూపరింటెండెంట్ చెప్పినా వినని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఐసీయూలను అప్పగించినా ఇదే పరిస్థితి తలెత్తుతుందనే వాదన వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది లేకుండా సేవలెలా... ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియామకాలు జరపకుండా, వైద్యం అందడం లేదనడం సరికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు కల్పించి, వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపితే కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందుతాయనేది నిపుణుల వాదన. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలైన ఎయిమ్స్, నిమ్హాన్స్, నిమ్స్ వంటి సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడవటం లేదా, వాటిని ఏవైనా కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. అత్యసవర సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న వాదన అశాస్త్రీయమైనదని పేర్కొంటున్నారు. తగిన నిధులు విడుదల చేసి, సిబ్బందిని కేటాయిస్తే మన రాష్ట్రంలోని ఆస్పత్రులు సైతం ఆ స్థాయిలో నిర్వహించ వచ్చని చెపుతున్నారు. విడతల వారీగా కార్పొరేట్ చేతుల్లోకి... మొన్న జిల్లా కేంద్ర ఆస్పత్రులను క్లినికల్ అటాచ్మెంట్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పజెప్పారని, నిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలను మెడాల్‌కు, రేడియాలజీ సేవలను కృష్ణా డయాగ్నోస్టిక్‌కు ఇచ్చారని, ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల వంతు వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదంతా పరిశీలిస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రులను ఒక్కసారిగా ప్రైవేటుపరం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నట్లు అర్థమవుతోందని చెబుతున్నారు. కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నమే ప్రభుత్వాస్పత్రుల్లోని విభాగాలను విడతల వారీగా కార్పొరేట్లకు అప్పగించడమంటే వారికి దోచిపెట్టడమే అవుతుంది. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకాలు జరిపి, అత్యాధునిక పరికరాలు సమకూర్చి, నిధులు కేటాయిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. - డాక్టర్ ఎం.కిరణ్, ప్రజా ఆరోగ్య వేదిక ఉపాధ్యక్షుడు సేవా దృక్పథం ఉండదు ప్రభుత్వాస్పత్రుల్లో ఐసీయూలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించటం సరైన చర్య కాదు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారు. బయట ఆస్పత్రుల్లో పనిచే స్తే రూ.లక్షల్లో జీతాలు వచ్చే అవకాశం ఉన్నా, ఇక్కడ ఇచ్చే అరకొర జీతాలకు సూపర్ స్పెషలిస్టులు కూడా సేవ చేయాలనే పనిచేస్తున్నారు. వారికి కాదని, లాభాపేక్ష కలిగిన కార్పొరేట్లకు అప్పగిస్తే వైద్యం వ్యాపారంగా మారుతుంది. - డాక్టర్ పవన్‌కుమార్, టీచింగ్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి