సర్కారీ ఆస్పత్రుల్లో మరణ మృదంగం
- 11 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిలో 42,297 మంది మృతి
- సగటున రోజుకు 115 మంది ప్రాణాలు గాలిలో
- వెంటిలేటర్లు, మందుల కొరతతో రోగుల మృత్యువాత
- ప్రభుత్వ పరిశీలనలో తేలిన చేదు నిజాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రులంటే ప్రాణం పోయాలి... కానీ ఏ ఆస్పత్రికెళ్లినా ఏమున్నది గర్వకారణం...చచ్చేది ఖాయం అన్నట్టుంది పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో పేద రోగులు పెద్దాసుపత్రులకు వెళ్లడం, అక్కడ సరైన వైద్య సేవలు అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం... ఇదీ తంతు. ఎక్కడైనా ఇన్‌పేషెంట్ల సంఖ్యలో రెండు శాతం మృతులు ఉంటేనే చాలా ఎక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఈ మృతుల సంఖ్య ఇన్‌పేషెంట్ల సంఖ్యలో 10 శాతం కంటే ఎక్కువగా ఉండటం అత్యంత పేలవమైన వైద్య సేవలు అందుతున్నట్లు అర్థమవుతోంది.
ఓవైపు అన్ని సేవలను ప్రైవేటుపరం చేస్తుండటం, మరోవైపు పలువురు ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్య ధోరణితో ఉండటం వంటి కారణాలు రోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ధర్మామీటర్ కొనుగోలు చేసినా అందులో అవినీతి అక్రమాలే ఉండటం, నాసిరకం కొనుగోలు పరికరాలను కొనుగోలు చేయడం వంటివి రోగులను పట్టి పీడిస్తున్నాయి. వివిధ పెద్దాసుపత్రుల్లో 42,297 మంది మృత్యువాత పడినట్టు పరిశీలనలో వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందినట్లు తెలిసింది. గంటకు 4నుంచి 5 మంది... రోజుకు సగటున 115 మంది రోగులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
కనీస వసతులు లేకనే మృతి
బోధనాసుపత్రులంటే రాష్ట్ర వైద్యవిద్యకు, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆయువుపట్టు లాంటివి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడే వైద్యవిద్య నేర్చుకుంటూంటారు. అలాంటి ఆస్పత్రుల్లోనే కనీస మౌలిక వసతులు లేవు. తీవ్ర గాయాలతో లేదా జబ్బులతో వచ్చిన వారికి వీల్ చైర్‌లు లేవు. వెంటిలేటర్ల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. రోజు వస్తున్న పేషెంట్లలో 10 శాతం మందికి మాత్రమే కృత్రిమ శ్వాస అందిస్తున్న పరిస్థితి. ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌ల విషయంలో అయితే గత మూడు మాసాల్లో రోగులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. అన్నిటికీ మించి రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు లేరు. కనీసం మూడు పడకలకు ఒక నర్సు ఉండాల్సి ఉండగా, 20 పడకలకు కూడా ఒక నర్సు లేదు. ఇక వైద్యుల పరిస్థితీ అంతే. ఇప్పటికీ 160 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు రక్తం కావాలన్నా దొరకని పరిస్థితి.
అవినీతికి ఇదో మచ్చుతునక
డయాలసిస్ బాధితుల కోసం 400 పడకలు కొన్నారు. రోగిని బరువు చూసి వైద్యమందిస్తారు. దీనికోసం పడకకే వెయింగ్ స్కేల్ (బరువును కొలిచే యంత్రం) ఉన్నది కొనాలి. కానీ ఒక కంపెనీతో ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు కుమ్మక్కై నాసిరకం మంచాలు కొన్నారు. దీంతో ప్రతిసారీ పేషెంటును దించడం, బరువు కొలచడం, మళ్లీ ఎక్కించడం జరుగుతోంది. దీనివల్ల ఒక్కో మంచం కొనుగోలులో రూ.30 వేల తేడా ఉండచ్చుగానీ, వేలాది మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు.
జబ్బు ముదిరితే చావే గతి...
- ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులకు వస్తున్న వారిలో మృతి చెందుతున్న వారిని పరిశీలిస్తే...
- ప్రమాద బాధితులు ఎక్కువమంది మృతి చెందుతున్నారు
- కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల మృతులు ఏటికేటికీ పెరుగుతున్నట్టు తేలింది
- శ్వాసకోశ వ్యాధుల బాధితులు ఈ ఏడాది ఎక్కువమంది మృతి చెందారు
- డెంగీ, గున్యా బాధితులకూ సకాలంలో వైద్యమందక మృతిచెందిన వారిలో ఉన్నారు
- గుండెజబ్బులతో బాధపడుతున్న వారు ప్రాణాలు వదులుతున్నారు
- కాలేయ వ్యాధుల మృతులు రెండేళ్లుగా తీవ్రమైనట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది
- ప్రసవ సమయంలో మృతిచెందుతున్న గర్భిణుల సంఖ్య కూడా వేలల్లో ఉంది
2016లో మృతి చెందిన వారు
ఆస్పత్రి - మృతుల సంఖ్య
జీజీహెచ్, కాకినాడ- 6,547
జీజీహెచ్, గుంటూరు - 7,940
ఎస్వీఆర్ జీజీహెచ్ తిరుపతి - 4,210
కింగ్‌జార్జి, విశాఖపట్నం - 4,502
రిమ్స్, ఒంగోలు - 1,072
రిమ్స్, శ్రీకాకుళం - 947
జీజీహెచ్, అనంతపురం - 2,618
జీజీహెచ్, విజయవాడ - 3,911
జీజీహెచ్, నెల్లూరు - 1,897
జీజీహెచ్, కర్నూలు - 6,744
రిమ్స్, కడప - 1,909
మొత్తం మృతుల సంఖ్య - 42,297
(ఇవి కాకుండా విశాఖపట్నంలోని ఛాతీ ఆస్పత్రి, గుంటూరు జిల్లా చినకాకాని లోని క్యాన్సర్ ఆస్పత్రిలో 1,200 మందిపైనే మృతి చెందినట్టు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అంతేకాదు వైద్యవిధాన పరిషత్‌లోని జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లోనూ మృతుల సంఖ్య అధికంగా ఉంది)