సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీ డయాగ్నస్టిక్స్ మినీ హబ్‌ల పేరిట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నెలకొల్పుతున్న వైద్య పరీక్షల కేంద్రాలు నగరంలో మరో 10 ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సేవలందిస్తున్న 8 మినీ హబ్‌లు కొన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండడం వల్ల మరో 10 కొత్తగా నెలకొల్పారు. ఇప్పటికే 319 బస్తీ దవాఖానాలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సేవలు అందిస్తుండగా కొత్తగా ఏర్పాటైన వాటిని 151 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల పరిధిలో రోగులు వినియోగించుకోనున్నారు.
ఎక్కడికక్కడే..
వైద్య పరీక్షల అవసరాల కోసం కొందరు ప్రైవేట్ ల్యాబ్‌ల మీదా మరికొందరు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి వంటి పెద్దాస్పత్రుల మీద ఆధారపడే పరిస్థితిని నివారించడానికి ఇవి అందుబాటులోకి తెచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను అవసరాన్ని బట్టి వైద్య పరీక్షల కోసం ఈ మినీ హబ్‌లకు సిఫారసు చేస్తారు. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, రేడియోలజీ, రక్తపోటు అనాలసిస్, ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్లు, ఈసీజీ, రేడియాలజీ తదితర సౌకర్యాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. (క్లిక్: 3 నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి)
కొత్త మినీ హబ్స్ అమీర్‌పేట్, శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పటాన్ చెరు, మలక్‌పేట్, హయత్‌నగర్, రాజేంద్ర నగర్, గోల్కొండ, నార్సింగి ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. వీటిలో నార్సింగ్‌లో మినీహబ్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు లాంఛనంగా బుధవారం ప్రారంభించగా, మిగిలిన వాటిని వేర్వేరు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. (క్లిక్: వాహనదారులపై భారీగా పెరిగిన జీవిత కాలం పన్ను)
Comments
Please login to add a commentAdd a comment