
'చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కరువు నిధులు మంజూరు చేయడంలేదని, తన విన్నపాలను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ చంద్రబాబు ప్రజల ముందు బేలతనాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
రాష్ట్ర సమస్యల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్రం ఆయనను అవమానిస్తుంటే ఎన్డీయే నుంచి వైదొలగాలని, కేంద్ర కేబినెట్లో ఉన్న టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, చంద్రబాబుకు మధ్య ఏర్పడ్డ ఇగో సమస్య రాష్ట్ర భవిష్యత్ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు నివారణపై దృష్టిపెట్టాల్సిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రలోభపెట్టడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారని, పశుగ్రాసం లేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణపై దృష్టిపెట్టి ప్రజలను ఆదుకోవాలని సీ రామచంద్రయ్య కోరారు.