
హైదరాబాద్‌లోనూ ‘కాల్ మనీ’ దందా
► అక్రమ వడ్డీ వ్యాపారుల భరతం పట్టిన
దక్షిణ మండలం పోలీసులు
► వేధింపులకు పాల్పడితే నిర్భయంగా ఫిర్యాదు
చేయండి: డీసీపీ
హైదరాబాద్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఉన్న కొద్దిపాటి ఆస్తులను జీపీఏ, ఎస్‌పీఏ చేయించుకొని రుణాలిస్తున్న ఘరానా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు దక్షిణ మండల పోలీసులు చెక్ పెట్టారు. డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో 25 టీమ్‌లు పాతబస్తీలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 56 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. పురానీహవేలీలోని తన కార్యాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. పాతబస్తీలోని వడ్డీ వ్యాపారులపై ఇప్పటికే పెద్ద ఎత్తున దాడులు చేసి దందాలను మూయించడం జరిగిందన్నారు.
నలుగురిపై పి.డి. యాక్ట్‌లు కూడా ప్రయోగించామన్నారు. వడ్డీ వ్యాపారులు కొత్త పంథాలో పేదల ఆస్తులను తమ పేర్లపై జీపీఏ చేయించుకొని 40-50 శాతం వడ్డీకి రుణాలిస్తున్నారన్నారు. రెండు మూడు నెలల్లో నే ఆస్తులను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని పేదలను రోడ్డున పడేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై సమాచారం అందడంతో పాతబస్తీ అంతటా దాడులు నిర్వహించినట్లు చెప్పారు. మొత్తం 56 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఫైనాన్స్ బుక్‌లు, రికార్డ్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో 30 మందిపై గతంలోనే కేసులు నమోదైనట్లు తేలిందన్నారు.
ఎక్కువ కేసులు నమోదైన వారిపై పి.డి. యాక్ట్‌లు ప్రయోగిస్తామన్నారు. వివరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. పాత నగరంలో మరో వారం రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగిస్తామన్నారు. పట్టుబడిన వారిలో రౌడీషీటర్లు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చెప్పారు. వడ్డీ వ్యాపారుల్లో ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం. ఈ సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్‌ల ఏసీపీలు అశోక చక్రవర్తి, శ్రీనివాసరావు, వి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయండి....
పాతబస్తీలో ఫైనాన్సర్లు వేధింపులకు గురిచేసినా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా.. ఎలాంటి భయం లేకుండా తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ సత్యనారాయణ బాధితులకు సూచించారు. స్థానిక స్టేషన్లలో గాని, నేరుగా తనకు(9490616476) ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.