యజమాని ఇంటికే కన్నం వేశాడు
- పుస్కార స్నానానికి రాజమండ్రి వెళ్తే ఘటన
- నగలు, నగదు, కారుతో డ్రైవర్ పరార్
- జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఎన్ఆర్ఐ
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం
బంజారాహిల్స్: పుష్కర స్నానానికి వెళ్లిన ఓ ఎన్నారై కుటుంబానికి చెందిన నగలు, నగదు, దుస్తులను కారు డ్రైవర్ సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లాడు. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ రాధానగర్‌లో నివసించే వ్యాపారి కొల్లి గాంధీ అల్లుడు ఆర్.నారాయణరెడ్డి, తన భార్య, కుమార్తెతో కలిసి పుష్కర స్నానం చేసేందుకు గతనెల 17న లండన్ నుంచి నగరానికి వచ్చారు.
గతనెల 18న రాజమండ్రిలో పుష్కర స్నానం చేసేందుకు గాంధీకి చెందిన కారులో జూబ్లీహిల్స్ గాయత్రీ హిల్స్కు చెందిన డ్రైవర్ గౌతంకృష్ణ(28)ను తీసుకెళ్లారు. అదే రోజు రాజమండ్రి చేరుకున్న వారు కారును వీఐపీ పార్కింగ్‌లో నిలిపారు. నారాయణరెడ్డి, ఆయన భార్య, కూతురు పుష్కర స్నానం కోసం గోదావరి నదికి వెళ్తూ తమ ఆభరణాలు, డబ్బులు, దుస్తులు, సెల్ఫోన్లు మూటకట్టి కారు వెనుక ఉంచి, కారు తాళాలు డ్రైవర్ గౌతంకృష్ణకు ఇచ్చారు. పుష్కరస్నానం చేసి తిరిగి వచ్చేసరికి కారుతో సహా డ్రైవర్ ఉడాయించాడు.
బాధితుడు నారాయణరెడ్డి రాజమండ్రి టుటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీసులు పెద్దగా స్పందించలేదు. అయితే డ్రైవర్ ను కారులో ఎక్కించుకుంది జూబ్లీహిల్స్ పరిధిలో కావడంతో ఈనెల 8న బాధితుడి మామ గాంధీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నగల విలువ రూ. 20 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఆభరణాలను గౌతంకృష్ణ తన సోదరికి ఇచ్చి వ్యవసాయ రుణం తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. క్షణక్షణం సెల్ఫోన్ సిమ్కార్డులు మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. ఇతను ఇప్పటి వరకూ 40 సిమ్కార్డులు వాడాడని, సెల్ఫోన్లు ఇంటి ఆవరణలో పాతిపెట్టాడని పోలీసులు గుర్తించారు.