రాహుల్, ఏచూరిపై కేసు
124 (ఏ), 156 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజాలతోపాటు జేఎన్‌టీయూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌లపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.
అఫ్జల్‌గురుకు మద్దతుగా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా జేఎన్‌టీయూ విద్యార్థి కన్హయ్య కుమార్ ప్రవర్తించాడని, ఇతనికి మద్దతుగా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరి, డి.రాజాలు నిలిచారని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన న్యాయవాది జనార్ధన్‌గౌడ్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో రాహుల్ గాంధీతో సహా పలువురిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది. పిటీషన్‌లో పేర్కొన్న వారందరిపై ఐపీసీ 124ఏ, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.