మనసులో ఉంది అడగలేకపోయిన రాహుల్
న్యూఢిల్లీ: జనతాదల్ యునైటెడ్ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను ఓ విషయాన్ని సూటిగా అడిగేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొహమాట పడ్డారు. ఆయన పక్కనే శరద్ యాదవ్ కూర్చున్నప్పటికీ ఆయన అడగలేకపోవడంతో ఆ విషయాన్ని సీతారాం ఏచూరి అడిగేశారు. ఇంతకీ రాహుల్ ఏం అడగాలని అనుకున్నారంటే.. మంగళవారం ప్రతిపక్షాలు భేటీ అయిన సందర్భంలో రైతు సమస్యలపైన చర్చించారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లి మోదీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెబుతూ ఎన్డీయే సర్కార్‌ను కార్నర్ చేయాలని భావించాయి.
అయితే, ఈ సమావేశానికి హాజరైన శరద్ యాదవ్ నాన్ స్టాప్‌గా రైతుల విషయంలో మాట్లాడారు. అయితే, అక్కడ ఉన్న రాహుల్‌గాంధీతో సహా పలువురు నేతలకు ఒక సందేహం వచ్చింది. శరద్ యాదవ్ పార్టీ తరుపున ఈ విషయం చెప్పారా లేక వ్యక్తిగతం చెప్పారా అని తెలుసుకోవాలనిపించింది. డైరెక్ట్‌గానే ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ అలా చేయలేకపోయారు. దీంతో సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆ బాధ్యత తీసుకొని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని శరద్ యాదవ్‌ను అడిగేశారు.
దీంతో ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోందని, తన పార్టీతరుపునే ఇలా అంటున్నట్లు తెలిపారు. అయితే, ఆ నేతల్లో ఒకరు గతంలో పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా శరద్ యాదవ్ మాట్లాడగా అదే పార్టీకి చెందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం విభేదించినట్లు గుర్తు చేశారు. దీంతోపాటు ఇటీవల నితీష్ కుమార్ ఎన్డీయేకు దగ్గరవుతున్నట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీకి తాజాగా ఈ అనుమానం వచ్చింది.