♦ ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో ఆయనే సూత్రధారి అనేందుకు ఆధారాలున్నాయి
♦ మాజీ న్యాయమూర్తులు,ప్రముఖ న్యాయవాదుల అభిప్రాయం
♦ ఏసీబీ నమోదు చేసిన అభియోగాలు బాబుకు వర్తిస్తాయి
♦ చంద్రబాబును విచారించేందుకు గవర్నర్ అనుమతి అవసరం లేదు
♦ ఒక వ్యక్తి ఫోన్‌కు వచ్చిన కాల్‌ను రికార్డు చేయడం ట్యాపింగ్ కాదు
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడిన కేసులో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదని న్యాయనిపుణులు పేర్కొం టున్నారు.
చంద్రబాబును నిందితుడిగా చేర్చి, విచారించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు ఏసీబీ వద్ద ఉన్నట్టేనని వారు తేల్చిచెబుతున్నారు. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన అభియోగాలన్నీ బాబుకు వర్తిస్తాయని వారు అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులతో ‘సాక్షి’ చర్చించింది. ఈ సందర్భంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
సమష్టి ఉద్దేశం(కామన్ ఇంటెన్షన్)
ఓటుకు నోటు వ్యవహారం వెనుక ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేయాలనే ఉద్దేశం (కామన్ ఇంటెన్షన్) చంద్రబాబుతో పాటు రేవంత్‌కు ఉంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను రేవంత్ సంప్రదించినట్లు స్పష్టమవుతోంది. బాబు తన ఫోన్ సంభాషణలోనూ ఈ విషయాన్ని అంగీకరించారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ.. ‘మనవాళ్లు అంతా వివరించారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను అండగా ఉంటా. మా వాళ్లు చెప్పినవన్నీ అమలు చేస్తాం. మనం కలసి పనిచేద్దాం..’ అని బాబు అంగీకరించారు. దీంతో రేవంత్‌తోపాటు బాబుకూ కామన్ ఇంటెన్షన్ ఉందని స్పష్టమవుతోంది.
సెక్షన్ 120(బి): నేరపూరిత కుట్ర
నేరం చేయాలని ప్రోత్సహించేందుకు ప్రయత్నించడం అవినీ తి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120(బి) కింద నేరం. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేతగా బాబే నేరపూరిత కుట్రకు రూపకల్పన చేశారు. కుట్రలో ఆయన భాగస్వామిగా ఉన్నారనేందుకు ఆధారాలున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డదారి తొక్కారు. అందులో భాగంగా ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేను రేవంత్ ప్రలోభపెట్టారు. ఈ డీల్‌ను బాబు సంభాషణ కూడా స్పష్టంగా వెల్లడిస్తోంది. డబ్బును సమకూర్చడంతోపాటు ఓటు తర్వాత మిగతా డబ్బును అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుట్రకు ఆయనే సూత్రధారి అనేందుకు ఈ ఆధారాలు చాలు.
ఆ స్టింగ్ ఆపరేషన్ చట్టబద్ధమే
రేవంత్ కేసులో ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ చేశారు కాబట్టి అవి సాక్ష్యాలుగా కోర్టు ముందు చెల్లవనే వాదనలో ఎంత మాత్రం నిజం లేదు. దర్యాప్తు సంస్థలు ఆధారాలను సేకరించేందుకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. దర్యాప్తు సంస్థలు ఆధారాలను సేకరించేందుకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించవచ్చని సీనియర్ న్యాయవాది ఆర్‌కే ఆనంద్‌కు సంబంధించిన కేసులో (2009(8)ఎస్‌సీసీ 106) అత్యున్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది.
ఓటుకు నోటు కేసులో గత నెల 28న ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. తర్వాత నిందితుల నేరపూరిత కుట్రను ఛేదించేందుకు ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించి, కీలక ఆధారాలను సేకరించింది. నిందితుల మీద అభియోగాలను నిరూపించేందుకు ఈ వీడియోలు కీలక సాక్ష్యాలు. భారత సాక్ష్యాధారాల చట్టం, ఐటీ చట్టం ప్రకారం నిందితులపై అభియోగాలను నిరూపించేందుకు తిరుగులేని సాక్ష్యాలివి.
అనుమతి అవసరమా?
చంద్రబాబును విచారించేందుకు గవర్నర్ అనుమతి అవసరమే లేదు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కోర్టు అభియోగాలను విచారణకు స్వీకరించేందుకు గవర్నర్ అనుమతి అవసరం. అయితే ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో ఏసీబీ పేర్కొన్న సెక్షన్ 12 కింద నిందితులపై అభియోగాలను మోపేందుకు ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని చట్టం స్పష్టం చేస్తోంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చవచ్చు.. విచారించవచ్చు.. చట్టపరంగా అభియోగాలు నమోదు చేసి చర్యలు చేపట్టవచ్చు.
ట్యాపింగ్ కానేకాదు..
‘తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఏపీ సీఎం సోమవారం కూడా ఆరోపించారు. అంటే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది తానేనని బాబు పరోక్షంగా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ ఒకవిషయాన్ని బాబు, ఆయన పార్టీ సభ్యులు విస్మరిస్తున్నారు. స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన టేపులు ఫోన్ ట్యాపింగ్ కిందకు రానేరావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటూ టీడీపీ నేతలు తన తో బేరసారాలు ఆడుతున్నారని స్టీఫెన్‌సన్ 29వ తేదీనే ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దానిని స్వీకరించిన ఏసీబీ స్టీఫెన్‌సన్‌కు తగిన సలహాలు, సూచనలు చేసింది. అందులో భాగంగానే ఆయన తన ఫోన్‌కు వచ్చిన ప్రతి కాల్‌ను రికార్డు చేశారు. ఒక వ్యక్తి తన ఫోన్‌కు వచ్చిన కాల్‌ను రికార్డు చేయడమంటే అది ట్యాపింగ్ కానేకాదు’ అని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
బాబు తప్పించుకోలేరు
Published Tue, Jun 9 2015 3:54 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement