పెద్దపల్లి పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ కేసు
పాత నోట్లకు కొత్తనోట్లు మార్పిడి చేసిన ఇద్దరు ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును అదునుగా చేసుకొని భారీగా నోట్ల మార్పిడికి పాల్పడ్డ పెద్దపల్లి పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది. పెద్దపల్లి డివిజన్ సూపరింటెండెంట్ జె.పండరి ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ రంగం లోకి దిగి ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. గతేడాది నవంబర్ 9 నుంచి 24 వరకు పెద్దపల్లి డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న ట్రెజరర్ సురేశ్‌రావు, మేడారం సబ్ పోస్టుమాస్టర్ సీహెచ్ భగత్‌సింగ్ పోస్టాఫీస్ అకౌంట్ నుంచి కొత్త నోట్లు డ్రాచేసి నకిలీ ధ్రువపత్రాలతో ప్రైవేట్ వ్యక్తులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పాత నోట్లు మార్పిడి చేశారని పండరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యా దులో తెలిపారు.
సురేశ్‌రావు రూ.30.76 లక్షలు, భగత్‌సింగ్ రూ.19.50 లక్షలు మార్పిడి చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొ న్నారు. ప్రాథమిక విచారణ చేసిన సీబీఐ ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంచేశారు. విచార ణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని, డబ్బు మార్పిడి చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులను కూడా విచారించాల్సి ఉంటుందని సీబీఐ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలోనూ హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్, హిమాయత్ నగర్ తదితర బ్రాంచ్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బందిపై నోట్ల మార్పిడికి సంబంధించి కేసులు నమోదు చేసిన సీబీఐ... ఆరోపణలెదుర్కుంటున్న వారిని కటకటాల్లోకి నెట్టింది.