వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అటాచ్ చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి ఒకవైపు బాధితులకు న్యాయం చేస్తూనే.. మరోవైపు ఈ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్షం సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. అగ్రిగోల్డ్ కుంభకోణంపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా తమ అభిప్రాయం వినిపిస్తున్న సమయంలోనే స్పీకర్ సభను అర్ధంతరంగా వాయిదా వేశారని తెలిపింది. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అధికార టీడీపీ నాయకులు కుమ్మక్కై తెలుగు రాష్ట్రాల్లోనూ.. దేశంలోని మిగతా రాష్ట్రాలు, విదేశాల్లోనూ ఆ సంస్థకున్న ఆస్తులను కారుచౌకగా కొట్టేశారని ఆరోపించింది. సీబీఐ దర్యాప్తు చేయిస్తే టీడీపీ నాయకులు కాజేసిన ఆస్తులు బయటపడతాయంది.
ప్రభుత్వం ఇప్పటిదాకా అటాచ్‌మెంట్ చేసుకోని అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైనా ఉంటే.. సీబీఐ దర్యాప్తులో అవి వెలుగుచూసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. టీడీపీ నాయకులు కొట్టేసిన ఆస్తులతోపాటూ అటాచ్‌మెంట్ చేసుకోని ఆస్తులను కూడా వేలం వేసి.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రతి రూపాయి వడ్డీతోసహా తిరిగి ఇప్పించి న్యాయం చేయవచ్చునని తెలిపింది. రాష్ట్రప్రభుత్వ చెప్పుచేతల్ల్లో నడిచే సీఐడీ దర్యాప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టీకరించింది. సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చి.. బాధితులకు న్యాయం జరుగుతుందని వివరించింది. పశ్చిమబెంగాల్‌లో రూ.2,460 కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆ రాష్ట్రప్రభుత్వం కోరిందని గుర్తు చేసింది. ‘శారదా’ కుంభకోణం కన్నా పెద్దదైన అగ్రిగోల్డ్ స్కాంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసింది.
కేసును నీరుగార్చేందుకే సీఐడీ దర్యాప్తు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం
అగ్రిగోల్డ్ వ్యవహారంలో తూతూ మంత్రంగా సీఐడీ దర్యాప్తు చేయించి టీడీపీ ప్రభుత్వం కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడులతో కలసి ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.2,460 కోట్ల శారదా కుంభకోణంపై అక్కడి ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయిస్తుంటే.. అసలు రూ.6,380 కోట్లు, వడ్డీతో కలిపి రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని చెవిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు
Published Tue, Mar 29 2016 2:22 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM
Advertisement
Advertisement