సెల్‌ఫోన్ చోరీలు చేస్తున్న ఇద్దరికి రిమాండ్
అడ్డగుట్ట: పరీక్షా సమయాల్లో విద్యార్థుల సెల్‌ఫోన్‌లు దొంగలించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం...లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బెన్‌హర్(20) తండ్రి పేరు ఇమాన్యుల్ డిప్లొమా చదువుతున్నాడు. కే. విజయ్(19) ఐటీ చేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అయితే, ఈ నెల 9వ తేదిన ఉదయం ఈస్ట్ మారేడుపల్లిలోని సేయింట్ జాన్స్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు తమ సెల్‌ఫోన్‌లు వారి వారి వాహనాల్లో పెట్టుకొని వెళ్లారు. కాగా, విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్లిన అంనంతరం బెన్‌హర్, విజయ్ హోండా యాక్టివాపై సేయింట్ జాన్స్ కాలేజీ దగ్గరకు వచ్చారు.
విద్యార్థుల వాహనాల్లో నుంచి సెల్‌ఫోన్‌లు దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ సెల్‌ఫోన్‌లు పోయాయని ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థులు వెంటనే స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీ వద్దనున్న సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వారి వాహనం నంబర్లు గుర్తించి ఆ ఇద్దరు యువకుల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.