సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకారం కరువై మూడున్నరేళ్లుగా మూలనపడ్డ రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులపై కేంద్రం వద్దే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునీకరణ పనులు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా, ఏపీ సహాయ నిరాకరణ చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ.. ఈ నెల 15న కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగే సమావేశంలో దీనిపై స్పష్టతకై పట్టుబట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అలాగే ఏపీ తెరపైకి తెచ్చే అభ్యంతరాలను సైతం ఇదే సమావేశంలో తిప్పికొట్టేలా వ్యూహం రచిస్తోంది.
ఆశించిన మేర అందని నీరు
వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి అందటం లేదు. దీని కింద పాత పాలమూరు జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టులో 36 వేల ఎకరాలకే నీరందుతోంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు.
దీంతో ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 6 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. కాల్వల ఆధునీకరణ కోసం రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడేళ్లుగా అడ్డు తగులుతూనే ఉన్నారు. దీంతో శాంతి భద్రతల సమస్యల కారణంగా కర్ణాటక పనులు నిలిపివేసింది.
మంత్రుల భేటీకి ముందుకు రాని ఏపీ..
గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తుంగభద్ర జలాల విడుదల అంశమై మాట్లాడేందుకు వచ్చిన సమయంలో ఆర్డీఎస్ అంశం ప్రస్తావనకు వచ్చింది. తాము పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీతో కలసి మూడు రాష్ట్రాల మంత్రుల సమావేశం నిర్వహిస్తే పనులపై స్పష్టత వస్తుందని పాటిల్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు రాష్ట్రం లేఖ రాసినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ అంశాన్ని కేంద్రం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment