‘విద్యుత్’కు కేంద్రం వెన్నుదన్ను: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్ల రుణాలను విడుదల చేసేందుకు ముందుకు వచ్చిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వీటిల్లో రూ.11,300 కోట్ల రుణాలను ఇప్పటికే విడుదల చేసిందన్నారు. ఈ రుణాలతోనే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఆర్‌ఈసీ, ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థల అధికారులతో శుక్రవారం ఇక్కడ సమీక్ష నిర్వహించిన అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ఇంకా ఏమైన అవసరాలుంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడి తీరుస్తానని అన్నారు.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు త్వరలో ప్రధాని నరేంద్ర మోదీచే శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఉత్తర-దక్షిణ భారత దేశాన్ని అనుసంధానించేందు కు నిర్మిస్తున్న వార్దా-డిచ్‌పల్లి-మహేశ్వరం విద్యుత్ కారిడార్ నిర్మాణాన్ని 2018 మేలోగా పూర్తి చేస్తామన్నారు. ఇందులో తెలంగాణకు 2000 మెగావాట్ల కారిడార్‌ను కేటాయించామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 2000 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రం లోని 12 మునిసిపాలిటీల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చుతున్నామన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలను గట్టెక్కించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో చేరి ప్రయోజనం పొందాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఈసీ ప్రాంతీయ డెరైక్టర్ ఎన్.వెంకటేశన్, పవర్ గ్రిడ్ ఈడీ వి.శేఖర్, ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాస్, బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.