పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
చిన్నకోడూరు: పల్లెలు బాగుంటేనే దేశం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ నిర్మాణ్ కార్యక్రమంలో భాగంగా శనివారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్ర ప్రభు త్వ సహకారాన్ని అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 28 కోట్లు, రైతు సంక్షేమం కోసం రూ. 21 లక్షల కోట్లు కేటాయించిందన్నారు.
మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులను 12 నుంచి 20 వారాల వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో.. బేటీ పడావో.. ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
యూపీఏ కుట్రవల్లే భద్రాచలం ముంపు
ఏపీ విభజనను యూపీఏ ప్రభుత్వం చేపట్టగా టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ కూడా మద్దతు తెలపడంతో తెలంగాణ ఏర్పడిం దని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ మం డలం ప్రజ్ఞాఫూర్‌లో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యేలా అప్పటి యూపీఏ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఏ వివాదానికైనా చర్చలతో పరిష్కారం దొరుకుతుందన్నారు.