ఎవరెస్ట్ శిఖరం ‘కాకా’
♦ సీఎం కేసీఆర్ కితాబు
♦ ట్యాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప వ్యక్తి జి.వెంకటస్వామి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. కాంగ్రెస్ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి దళిత నేతగా వెంకటస్వామి ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగారని కీర్తించారు. ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అపార అనుభవం, రాజీలేని పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమన్నారు. 91 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురైన కాకాను ఆసుపత్రిలో పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు ‘‘ఎట్లన్నా తెలంగాణ చూసి పోవాలనేది నా చివరి కోరిక’’ అని అన్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
బతికున్నంత కాలం తెలంగాణ కోసం తపనపడి... ఆపై రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూసిన ధన్యజీవి ఆయన అన్నారు. ఇదే సందర్భంగా మేరా సఫర్ పేరిట వెంకటస్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. తొలి పుస్తక ప్రతిని సీఎం కేసీఆర్‌కు అందించారు. వెంకటస్వామి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని దత్తాత్రేయ సూచించారు. చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు వెంకటస్వామి టఅని, కార్మికులు, పేదల కోసమే ఆయన నిరంతరం పోరాడారన్నారు. ఆయ న స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులకు ‘స్మార్ట్ కార్డులు’ అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ జాతి తనను తాను గౌరవించుకోవడమేనని స్పీకర్ మధుసూదనచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కేకేలు పాల్గొన్నారు.
పెద్దపల్లిలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వండి: వినోద్
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని మాజీ మంత్రి, వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తన తండ్రి అందించిన సేవలను గుర్తించి ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ కాకా విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘మేరా సఫర్’ ఆంగ్ల పుస్తకాష్కరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించినట్లు కాకా మరో కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. 1972లో కేంద్ర కేబినేట్‌లో ప్రణబ్, తన తండ్రి మంత్రులుగా పని చేశారని... అప్పట్నుంచీ ఉన్న అనుబంధంతోనే పుస్తకావిష్కరణకు రాష్ట్రపతి అంగీకరించారన్నారు.