kaka
-
ఫుట్‌బాల్ ఆటకు కాకా టాటా...
బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ కాకా ఆటకు బైబై చెప్పాడు. 2002 ‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడైన కాకా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తాను ప్లేయర్‌గా మాత్రమే రిటైర్ అవుతున్నానని, పుట్‌బాల్ క్రీడకు దగ్గరగానే ఉంటానని స్పష్టం చేశాడు. క్లబ్ మేనేజర్, స్పోర్టింగ్ డైరెక్టర్ వంటి పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉంటానన్నాడు. 35 ఏళ్ల కాకా పూర్తి పేరు రికార్డో ఎల్జెక్సన్ డాస్ సాంతోస్ లిటీ. ఫుట్‌బాల్ వర్గాల్లో మాత్రం కాకా పేరుతో ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ పురస్కారాన్ని 2007లో అందుకున్నాడు. కెరీర్లో మిలాన్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌లకు ఆడాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్‌లు ఆడి 29 గోల్స్ చేశాడు. -
‘కాకా’ విగ్రహ ఏర్పాటుపై జోక్యానికి హైకోర్టు తిరస్కరణ
అభ్యంతరాలను ప్రభుత్వానికి చెప్పుకోవాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని సచివాలయం సమీపంలోని అంబేడ్కర్ పార్కులో ఏర్పాటు చేయడంపై దాఖలైన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అంబేడ్కర్ పార్కులో వెంకటస్వామి విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలుంటే, వాటిని వినతిపత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పిటిషనర్ అంగీకరించడంతో, నిర్దిష్ట కాల వ్యవధిలోపు పిటిషనర్ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంబేడ్కర్ పార్కులో కాకా విగ్రహం ఏర్పాటు సరికాదని, అక్కడ అంబేడ్కర్ లేదా యోగముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలంటూ అంబేడ్కర్ పార్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ బండారు నర్సింహులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. విగ్రహం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని లేదా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని తేల్చి చెప్పింది. -
ఎవరెస్ట్ శిఖరం ‘కాకా’
♦ సీఎం కేసీఆర్ కితాబు ♦ ట్యాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహావిష్కరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప వ్యక్తి జి.వెంకటస్వామి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. కాంగ్రెస్ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి దళిత నేతగా వెంకటస్వామి ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగారని కీర్తించారు. ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అపార అనుభవం, రాజీలేని పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమన్నారు. 91 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురైన కాకాను ఆసుపత్రిలో పరామర్శించేందుకు తాను వెళ్లినప్పుడు ‘‘ఎట్లన్నా తెలంగాణ చూసి పోవాలనేది నా చివరి కోరిక’’ అని అన్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. బతికున్నంత కాలం తెలంగాణ కోసం తపనపడి... ఆపై రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూసిన ధన్యజీవి ఆయన అన్నారు. ఇదే సందర్భంగా మేరా సఫర్ పేరిట వెంకటస్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. తొలి పుస్తక ప్రతిని సీఎం కేసీఆర్‌కు అందించారు. వెంకటస్వామి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని దత్తాత్రేయ సూచించారు. చిన్నస్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు వెంకటస్వామి టఅని, కార్మికులు, పేదల కోసమే ఆయన నిరంతరం పోరాడారన్నారు. ఆయ న స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులకు ‘స్మార్ట్ కార్డులు’ అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ జాతి తనను తాను గౌరవించుకోవడమేనని స్పీకర్ మధుసూదనచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కేకేలు పాల్గొన్నారు. పెద్దపల్లిలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వండి: వినోద్ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని మాజీ మంత్రి, వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తన తండ్రి అందించిన సేవలను గుర్తించి ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ కాకా విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘మేరా సఫర్’ ఆంగ్ల పుస్తకాష్కరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించినట్లు కాకా మరో కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ చెప్పారు. 1972లో కేంద్ర కేబినేట్లో ప్రణబ్, తన తండ్రి మంత్రులుగా పని చేశారని... అప్పట్నుంచీ ఉన్న అనుబంధంతోనే పుస్తకావిష్కరణకు రాష్ట్రపతి అంగీకరించారన్నారు. -
కాకా అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. పూర్తి అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుని... వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్, జైపాల్‌రెడ్డి ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్తలతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. -
కాకా అంత్యక్రియలకు రాహుల్ గాంధీ
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అంత్యక్రియలకు ఆపార్టీ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాకా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. రాహుల్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ రానున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ వెంకటస్వామి నిన్న రాత్రి కేర్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు నెక్లెస్ రోడ్డులో కాకా ఘాట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య...తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. -
తెలంగాణ రాజకీయ భీష్ముడు
* ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం * కార్మిక పక్షపాతిగా పేరు తె చ్చుకున్న కాకా * 7 సార్లు ఎంపీగా విజయబావుటా * రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు * కేంద్రమంత్రిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో బాధ్యతలు సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని: రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామిది సుదీర్ఘ ప్రస్థానం. అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనను వరించిన పదవులు ఎన్నో. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో మల్లయ్య, పెంటమ్మ దంపతులకు జన్మించిన కాకాకు 1944లో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న వెంకటస్వామి కార్మిక నేతగా మంచి గుర్తింపు పొందారు. 1957లో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీకి 1961-64 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. పేదలకు గుడిసెలను నిర్మించాలనే లక్ష్యంతో ‘నేషనల్ హట్స్ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. వేలాది మంది నిరుపేదలకు గుడిసెలు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం 1973లో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో అంబేద్కర్ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి 1967, 1971, 1977లలో ఎంపీగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావుల హయాంలో కార్మిక, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ర్టంలో శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2009లో 15వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో వెంకటస్వామికి టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో తన తనయుడు వివేక్‌ను రాజకీయ అరంగేట్రం చేయించారు. కాకా మరో తనయుడు జి.వినోద్ కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణను స్వప్నించి.. కనులారా వీక్షించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడి గా పనిచేసిన సమయంలో వెంకటస్వామి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. ప్రత్యేక తెలంగాణ రా్రష్ట్రాన్ని చూడడమే తన స్వప్నమని అనేకమార్లు పేర్కొన్న కాకా... రెండు మూడుమార్లు తీవ్ర అస్వస్థతకు గురైనా మళ్లీ కు దుటపడ్డారు. తెలంగాణ రా్రష్ట్రాన్ని చూసేం దుకే తాను బతికి ఉన్నానని ఆయన చెప్పేవారు. అనుకున్న ట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూశారు. కాంగ్రెస్‌లో వివాదరహితునిగా, దళిత నేతగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను ఆశించారు. అయితే రాజకీయ సమీకరణాల వల్ల ఆ పదవు లు పొందలేకపోయారు. ఈ అసంతృప్తితోనే 2011లో బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అ నంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా పని కిరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా సీడబ్ల్యూసీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం కోసం.. సింగరేణి సంస్థలో 1996 కంటే ముందు గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఆ సమయంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రంతో మాట్లాడి గని కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. 1998లో జరిగిన వేతన ఒప్పందం సమయంలో సింగరేణి వద్ద డబ్బులు లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రూ.400 కోట్లు తీసుకుని కార్మికులకు వేతనం చెల్లించేలా చూశారు. కాజీపేట నుంచి సిర్పూర్కాగజ్నగర్ వరకు రామగిరి ప్యాసింజర్ రైలును వేయించారు. సింగరేణి కార్మికులు ఆయనతో తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు తీర్చుతూ కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. సింగరేణిలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు. కాకా రాజకీయ ప్రస్థానం * 1957-62, 1978-84 మధ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, 1978-82 మధ్య రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు * 1967లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక * 1971, 1977, 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలుపు * కేంద్ర కేబినెట్లో కార్మిక, పౌర సరఫరాలు, పునరావాసం, చేనేత, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు * 1961-64 మధ్య ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కొనసాగారు * 1982-84 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు * కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ డిప్యూటీ లీడర్‌గానూ వ్యవహరించారు. ప్రముఖుల సంతాపం అంకితభావంతో సేవలందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పార్లమెంటేరియన్ జి.వెంకటస్వామి మృతి రాష్ట్రానికి ఎంతో నష్టం. పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు అంకితభావంతో సేవలందించారు. ఆయన మృతితో రాష్ట్రం ముఖ్యనేతను కోల్పోయింది. - నరసింహన్, గవర్నర్ పేదల కోసం పాటుపడ్డారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి.వెంకటస్వామి మరణం బలహీన వర్గాలకు ఎంతో నష్టం. ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. - బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి తీరని లోటు వెంకటస్వామి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. - చంద్రబాబునాయుడు, ఏపీ ముఖ్యమంత్రి కార్మికుల కోసం ఎంతో కృషి చేశారు సీనియర్ పార్లమెంటేరియన్ జి.వెంకటస్వామి మృతికి ప్రగాఢ సంతాపం. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి. కార్మికులు, కర్షకుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. - జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ అధినేత ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి, కాకా మృతికి సంతాపం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. -ఎన్.రఘువీరారెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్‌కు భీష్మాచార్యుడు తెలంగాణ కాంగ్రెస్‌కు వెంకటస్వామి భీష్మాచార్యుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నా. - డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎంతో బాధ కలిగించింది వెంకట స్వామి మృతి చెందారన్న వార్త ఎంతగానో బాధ కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. - కె. జానారెడ్డి, టీసీఎల్పీ నాయకుడు దళిత ఉద్యమాలకు దిక్సూచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి దళిత ఉద్యమాలకు దిక్సూచిలా వ్యవహరించారు. అలాంటి నాయకుడు మృతి చెందడం దురదృష్టకరం. -జాన్ వెస్లీ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సంతాపం తెలిపారు. -
కాకాతో చెరగని బంధం
హ్యాట్రిక్ వీరుడి అస్తమయం సిద్దిపేట జోన్: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముద్దుగా పిలుచుకునే కాక (జి. వెంకటస్వామి)తో సిద్దిపేట ప్రాంతానికి చెరగని రాజకీయ బంధం పెనవేసుకుంది. సీనియర పార్లమెంటేరియన్‌గా చరిత్ర నిలుపుకున్న జి. వెంకటస్వామి రాజకీయ ఓనమాలు నేర్చింది, ఎదిగింది సిద్దిపేటలోనే. సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి వరుసగా మూడు సార్లు గెలిచి హైట్రిక్ను సొంతం చేసుకున్న వెంకటస్వామి సోమవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం మెదక్ జిల్లా, ముఖ్యంగా సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణుల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సిద్దిపేట నుంచి ఎంపీగా పార్లమెంటులో పని చేసిన మల్లికార్జున్ తర్వాత సిద్దిపేట నియోజకవర్గ బాధ్యతలను జి. వెంకటస్వామి మోశారు. 1967లో తొలిసారి సిద్దిపేట నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులోకి అడుగు పెట్టారు. అదే పరంపరతో 1971, 1977 వరుస ఎంపీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి హైట్రిక్ రికార్డుల్లో సిద్దిపేట నుంచి తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. ఈ మూడు పరియాయాలు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ అభివృద్ధికి, సిద్దిపేట రైల్వే మార్గానికి ఆయన హయాంలోనే బీజాలు పడ్డాయి. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈయన స్థానాన్ని కాలక్రమేనా కాంగ్రెస్ పార్టీలో నంది ఎల్లయ్య సొంతం చేసుకున్నారు. దీంతో గత దశాబ్ధ కాలం పాటు సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో కాంగ్రెస్ శ్రేణులతో సత్సంబంధాలను కొనసాగించిన వెంకటస్వామి అనుకోకుండానే సిద్దిపేట రాజకీయ చిత్రాలకు దూరంగా ఉన్నారు. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతూ సోమవారం ఆయన మృతి చెందడాన్ని సిద్దిపేట ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోయారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి(85) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 8.40 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 1929 అక్టోబరు 5న ఆయన సికింద్రాబాద్‌లో జన్మించారు. 1957, 1978లలో ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో తొలిసారిగా పెద్దపల్లి నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో ఆయన పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కొడుకులూ రాజకీయాలలోనే ఉన్నారు. మాజీ మంత్రి శంకర రావు ఆయన పెద్ద అల్లుడు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ముషీరాబాద్ జైలు వద్ద జరిగిన కాల్పుల్లో వెంకటస్వామి గాయపడ్డారు. నేషనల్ హట్స్ సొసైటీ కింద వేల మంది పేదలకు ఆయన గుడిసెలు నిర్మించారు. అప్పటి నుంచి ఆయనను గుడిసెల వెంకటస్వామిగా పిలుస్తారు. కాకా స్థాపించిన విద్యాసంస్థను ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోకుండా నిర్వహిస్తున్నారు. వెంకటస్వామి ఎన్నికైన, చేపట్టిన పదవులు: 1957- 62, 1978-84 శాసనసభ సభ్యుడు 1967 లో 4వ లోకసభకు పెద్దపల్లి నుంచి ఎన్నికయ్యారు. 1969 - 71 పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు 1971 లో 5వ లోకసభకు ఎన్నికయ్యారు. 1973 - 1977 - కేంద్ర మంత్రి 1977 లో 6వ లోకసభకు ఎన్నికయ్యారు. 1978 - 1982 రాష్ట్ర మంత్రి 1982 - 1984 పిసిసి అధ్యక్షుడు 1989 లో 9వ లోకసభకు ఎన్నికయ్యారు. 1991 లో 10వ లోకసభకు ఎన్నికయ్యారు. 1991-1996 కేంద్ర మంత్రి 1996 లో 11వ లోకసభకు ఎన్నికయ్యారు. 2002-2004 ఏఐసీసీ ఎస్సీ అండ్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు. 2004 లో 14వ లోకసభకు ఎన్నికయ్యారు. ఇంకా కేంద్రంలో అనేక కమిటీలలో సభ్యుడుగా ఉన్నారు. -
'కాకా పరిస్థితి విషమంగానే ఉంది'
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేర్ డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కేర్ ఆస్పత్రి డాక్టర్లు.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా వెంకటస్వామికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు. -
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
-
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు ఎంతో ఇష్టమైన 'ఆశీర్వాద్' బంగ్లా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ముంబయి బాంద్రాలోని ఇదే బంగ్లాలో రాజేశ్ ఖన్నా 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత వారసత్వం కింద కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నాలకు ఆ ఆస్తి సంక్రమించింది. వారు ఇప్పుడు ఆ బంగ్లాను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇంట్లో నివసించిన అనుబంధంతో ఆశీర్వాద్‌ను మ్యూజియంగా మార్చాలని ఖన్నా ఆశించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తన కూతుళ్లదేనని మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన చెప్పారు. ప్రస్తుతం వరదాన్ ఆశీర్వాద్‌గా పిలుస్తున్న ఆ ఇంటిని ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మన్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా బంగ్లా ఆస్తిలో తనకు వాటా ఉంటుందని, రాజేశ్ ఖన్నా తనకు కూడా భర్తేనని ఆయన సహచరి అనితా అద్వానీ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఖన్నా కుటుంబ సభ్యులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కూడా. డింపుల్ ఖన్నాతో విడిపోయిన అనంతరం రాజేశ్ ఖన్నా ఎనిమిదేళ్లు అనితా అద్వానీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే.. అనితా అద్వానీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని రాజేశ్ ఖన్నా భార్య డింపుల్, కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వాదిస్తూ వచ్చారు. ఆశీర్వాద్ బంగ్లా తమ పేరు మీద ఉందని, అందుకే అమ్మకానికి పెట్టినట్లు వారు చెబుతున్నారు. దాంతో ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదని పేర్కొంటూ అనితా అద్వానీ మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే వివాదంలో కోర్టులో తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. అయితే కాకాజీ కుటుంబీకులు న్యాయస్థానంపై గౌరవం ఉంచకుండా బంగ్లాను విక్రయించాలనుకోవటం సరికాదన్నారు. దీనిపై తాను తుది వరకూ పోరాడతానకి అనితా అద్వానీ స్పష్టం చేశారు. సముద్రానికి అభిముఖంగా 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.90 కోట్ల వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాల కథనం. అయితే ఎవరైనా థర్డ్ పార్టీ.. యాజమాన్య హక్కును కోరడానికి సంబంధించి జారీ చేసిన 14 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాతే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంద నేది విశ్వసనీయ వర్గాల కథనమని టైమ్స్ ఆఫ్ ఇండియూ పేర్కొంది. 60వ దశకం చివర్లో మరో బాలీవుడ్ దిగ్గజం రాజేంద్రకుమార్ నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిన రాజేశ్‌ఖన్నా 80వ దశకంలో దాన్ని పునర్నిర్మించారు.