కాకాతో చెరగని బంధం
హ్యాట్రిక్ వీరుడి అస్తమయం
సిద్దిపేట జోన్: కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముద్దుగా పిలుచుకునే కాక (జి. వెంకటస్వామి)తో సిద్దిపేట ప్రాంతానికి చెరగని రాజకీయ బంధం పెనవేసుకుంది. సీనియర పార్లమెంటేరియన్‌గా చరిత్ర నిలుపుకున్న జి. వెంకటస్వామి రాజకీయ ఓనమాలు నేర్చింది, ఎదిగింది సిద్దిపేటలోనే. సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి వరుసగా మూడు సార్లు గెలిచి హైట్రిక్‌ను సొంతం చేసుకున్న వెంకటస్వామి సోమవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడం మెదక్ జిల్లా, ముఖ్యంగా సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణుల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
సిద్దిపేట నుంచి ఎంపీగా పార్లమెంటులో పని చేసిన మల్లికార్జున్ తర్వాత సిద్దిపేట నియోజకవర్గ బాధ్యతలను జి. వెంకటస్వామి మోశారు. 1967లో తొలిసారి సిద్దిపేట నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులోకి అడుగు పెట్టారు. అదే పరంపరతో 1971, 1977 వరుస ఎంపీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి హైట్రిక్ రికార్డుల్లో సిద్దిపేట నుంచి తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. ఈ మూడు పరియాయాలు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ముఖ్యంగా కంటోన్‌మెంట్ అభివృద్ధికి, సిద్దిపేట రైల్వే మార్గానికి ఆయన హయాంలోనే బీజాలు పడ్డాయి. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈయన స్థానాన్ని కాలక్రమేనా కాంగ్రెస్ పార్టీలో నంది ఎల్లయ్య సొంతం చేసుకున్నారు.
దీంతో గత దశాబ్ధ కాలం పాటు సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో కాంగ్రెస్ శ్రేణులతో సత్సంబంధాలను కొనసాగించిన వెంకటస్వామి అనుకోకుండానే సిద్దిపేట రాజకీయ చిత్రాలకు దూరంగా ఉన్నారు. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతూ సోమవారం ఆయన మృతి చెందడాన్ని సిద్దిపేట ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోయారు.