‘కాకా’ విగ్రహ ఏర్పాటుపై జోక్యానికి హైకోర్టు తిరస్కరణ
అభ్యంతరాలను ప్రభుత్వానికి చెప్పుకోవాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని సచివాలయం సమీపంలోని అంబేడ్కర్ పార్కులో ఏర్పాటు చేయడంపై దాఖలైన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అంబేడ్కర్ పార్కులో వెంకటస్వామి విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలుంటే, వాటిని వినతిపత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పిటిషనర్ అంగీకరించడంతో, నిర్దిష్ట కాల వ్యవధిలోపు పిటిషనర్ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంబేడ్కర్ పార్కులో కాకా విగ్రహం ఏర్పాటు సరికాదని, అక్కడ అంబేడ్కర్ లేదా యోగముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయాలంటూ అంబేడ్కర్ పార్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ బండారు నర్సింహులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. విగ్రహం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని లేదా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని తేల్చి చెప్పింది.