సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చినా, దాన్ని అమలు చేయకుండా బెట్టు చేసిన శాసనసభ కార్యదర్శి మెట్టు దిగారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రెండు వారాల గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. హైకోర్టు, వారంలోపు తీర్పును అమలు చేస్తున్నారా? లేదా? స్పష్టంగా చెప్పమంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
తమను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, అలాగే తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చినా దానిని అమలు చేయని అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ ఇటీవల హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. నరసింహాచార్యులు తరఫున సీని యర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు.
ధిక్కారానికి పాల్పడ్డారని ఇరువురు కార్యదర్శుల వ్యక్తిగత హాజరుకు కోర్టు ఫాం–1 నోటీసు జారీ చేయాలనుకుంటే తాము మొదట వాదనలు వినిపిస్తామన్నారు. ఫాం–1 కింద నోటీసు జారీ చేసేటప్పుడు నోటీసులు అందుకునే వ్యక్తుల వాదనలు వినాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పును అమలు చేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు. కోర్టు తీర్పు అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వేదుల బదులిచ్చారు. రెండు వారాలు గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. దీనికి న్యాయమూర్తి వారమే గడువిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment