
మిత్రుల వల్లే ఈ స్థాయికి...
జీవితంలో తాను పైకి రావడానికి కారణం మిత్రులేనని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
- యూఎన్ హాబిటాట్ గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మిత్రుల ఆత్మీయ సన్మానం
సాక్షి, హైదరాబాద్: జీవితంలో తాను పైకి రావడానికి కారణం మిత్రులేనని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. నమ్ముకున్న సిద్ధాంతం, శ్రమ, క్రమశిక్షణతోపాటు వివిధ స్థాయిల్లో మిత్రుల సహకారం అందుకు దోహదపడిందన్నారు. యూఎన్ హాబిటాట్ గవర్నింగ్ కౌన్సి ల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకయ్య హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా శనివారం ఆయనకు మిత్రులు, సన్నిహితులు సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరిట ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇది దేశానికి లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. పదవిని ఉత్తమంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
వ్యర్థాల ద్వారా వచ్చే కంపోస్ట్ రైతులకు..
పెరుగుతున్న జనాభా, కాలుష్యం, రద్దీ, ఆరోగ్యంపై ఒత్తిడికి సంబంధించి నూతన పట్టణీకరణ ఎజెండా, భవిష్యత్ ప్రణాళికలపై యూఎన్ హాబిటాట్ దృష్టి పెట్టిందని వెంకయ్య తెలిపారు. కెన్యా రాజధాని నైరోబిలో శుక్రవారం ముగిసిన యూన్ హాబిటాట్ సమావేశంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భేదాభిప్రాయాన్ని చాకచక్యంగా పరిష్కరించే అవకాశం తనకు లభించిందన్నారు. ప్రపంచజనాభా 1976లో 37.9 శాతం నగరాల్లో జీవించగా 2016కు 54.5 శాతానికి చేరుకుందని, 2020కల్లా 60 శాతానికి చేరుకోనుందన్నారు. ప్రపంచంలో కేవలం 2 శాతం భూభాగంలోనే నగరాలున్నాయని.. కానీ 70 శాతం గ్రీన్‌హౌస్ వాయువులు, ప్రపంచ వ్యర్థాలతోపాటు 60 శాతం విద్యుత్ వినియోగం ఈ నగరాల నుంచే ఉన్నాయన్నారు. కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, వాతావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వ్యర్థాల ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువును ఆయా సంస్థల ద్వారా కాకుండా వ్యవసాయశాఖ ద్వారా నేరుగా రైతులకు పంపిణీ చేస్తామని అన్నారు.
వెంకయ్య రాజకీయ బాహుబలి: కె. రాఘవేంద్రరావు
అచ్చమైన తెలుగుదనానికి వెంకయ్య నాయుడు మారుపేరని దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొనియాడారు. ఉత్తమ మానవ విలువలతో రాజకీయ బాహుబలిగా నిలిచిన వెంకయ్యను సాహో అంటూ ప్రశంసించారు. స్వశక్తితోఎదిగిన వెంకయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావు అన్నారు. తామంతా వెంకయ్యకు నిత్య విద్యార్థులమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. మాడుగుల నాగఫణిశర్మ ఆశీర్వచనం పలకగా పలువురు ప్రముఖులు శాలువాలు, బొకేలతో వెంకయ్యను సన్మానించారు. డా. ఎన్. గౌతమ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎన్. ఇంద్రసేనారెడ్డి, ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పారిశ్రామికవేత్త డీవీ మనోహర్, గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ డా. కె. రవీంద్రనాథ్, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాల్గొనగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వందన సమర్పణ చేశారు.