మహా ఒప్పందంపై చర్చించాల్సింది: చాడ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పద్ధతుల్లో అసెంబ్లీ, అఖిలపక్ష భేటీల్లో చర్చించి మహా ఒప్పందం చేసుకుంటే బావుండేదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రతో సంప్రదింపుల ద్వారా ఈ జలాల వినియోగానికి చేస్తున్న ప్రయత్నం మంచిదైనా, వివిధ పార్టీలు, ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవగాహన కుదుర్చుకుని ఉంటే సబబుగా ఉండేదన్నారు.
గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల సీపీఐ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని గోదావరి నుంచి మళ్లించడానికి లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఈ ఒప్పందంలో బీజేపీ నాయకత్వం పెత్తనం, కేంద్ర మంత్రి జోక్యాన్ని ఖండిస్తున్నట్లు విడిగా విలేకరులతో మాట్లాడినపుడు ఆయన వ్యాఖ్యానించారు.