కూలీ బాగోతంతో బిల్డప్: చాడ
సాక్షి, హైదరాబాద్: గులాబీ కూలీల పేరిట టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పార్టీ నాయకుల కూలీ సంపాదనతోనే టీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించినట్లుగా కూలీ బాగోతంతో బిల్డప్ ఇచ్చారని ధ్వజమెత్తారు. కూలీలతో రాజకీయ నాయకులు రూ.లక్షల్లో డబ్బులు సంపాదించినపుడు మండుటెండల్లో కాయకష్టం చేసే నిజమైన కూలీలు ఎందుకు బతకలేకపోతున్నారని ప్రశ్నించారు. శనివారం మఖ్దూంభవన్‌లో మల్లేపల్లి ఆదిరెడ్డితో కలసి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీ యావత్తు కేసీఆర్ భజన చేయడం, డబ్బాకొట్టడం మినహా మరేమీ లేదని.. కేసీఆర్‌ను మెచ్చుకోకపోతే టీఆర్‌ఎస్ నాయకులకు బతుకు లేదన్నారు.
రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములు, అటవీహక్కుల చట్టాలు, సాదాబైనామాల అమలు అంశాలపై ప్లీనరీలో చర్చించలేదన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటూ అరిగిపోయిన రికార్డును వినిపించారని, ఎరువులను ఉచితంగా సరఫరా చేస్తామంటూ రైతులను ఊరించే ప్రయత్నం చేయకుండా ఈ ఏడాది నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న మిర్చి, కంది రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. సిద్దిపేట, బోయినపల్లి మార్కెట్‌లలోనే కాకుండా అన్ని మార్కెట్‌లలో రూ.5 సద్దన్నం పథకం అమలు చేయాలన్నారు.