మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు...
హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో మంగళవారం సాయంత్రం చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. 15 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లిన దొంగలు...మరో మహిళ మెడలోని ఆభరణాలను లాగబోయి ఆమె నిలువరించడంతో బైక్‌పై దూసుకెళ్లపోబోయారు. అప్పటికే సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు మాటువేసి ఇద్దరు చైన్‌స్నాచర్లను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆశ్విని మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని విప్రో జంక్షన్ రోడ్డుపైకి కాలినడకన బయలుదేరింది. అప్పటికే మాటువేసిన చైన్‌స్నాచర్లు పల్సర్ బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆ వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో గుమికూడిన ఇతర ఐటీ ఉద్యోగులు డయల్ 100కి కాల్ చేశారు. ఈ సమాచారం అందుకున్న గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) సిబ్బంది విప్రో జంక్షన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు కూర్చొని వెళుతున్న పల్సర్ బైక్‌ను గుర్తించారు. ఆ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.
ఆలోపే ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా కార్వీ ఆఫీసు ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న కల్పనాలత మెడలో నుంచి చైన్ లాగారు. మళ్లీ గచ్చిబౌలి ఐఐటీ వైపు తిరిగి వస్తుండగా హిల్‌రిడ్జ్ విల్లాస్ ముందు నడుచుకుంటూ వెళుతున్న ఓ పనిమనిషి మెడలో బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె గట్టిగా నిలువరించడంతో ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీసులు ఐఐటీ జంక్షన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.