రాయలసీమ అభివృద్ధికి నిధులు, నీళ్లు కావాలనే డిమాండ్‌తో పది వామపక్ష పార్టీలు మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి.
నీళ్లు, నిధులు కావాలని వామపక్షాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాయలసీమ అభివృద్ధికి నిధులు, నీళ్లు కావాలనే డిమాండ్‌తో పది వామపక్ష పార్టీలు మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాయి. డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో చలో అసెంబ్లీ చేపట్టాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాయలసీమ పరిస్థితిని చర్చించాలని డిమాండ్ చేశాయి.
చలో అసెంబ్లీ సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని పేర్కొన్నాయి. రాయలసీమ సమస్యలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రస్తావించి చర్చ జరిగేలా చూడాలని సీపీఐ, సీపీఎంలు విజ్ఞప్తి చేశాయి. పెట్టుబడి రాయితీ, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం, నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరాయి.
22న చలో విజయవాడ: గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తానని, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తానని వాగ్దానం చేసి 21 నెలలు గడిచినా పట్టించుకోని టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 22న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తున్నట్లు పది వామపక్ష పార్టీలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి.